Share News

గోవాడ షుగర్స్‌ మాజీ ఎండీ సుధాకర చౌదరి మృతి

ABN , Publish Date - May 12 , 2026 | 12:43 AM

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ మాజీ ఎండీ రావి సుధాకర చౌదరి(80) ఆదివారం రాత్రి మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందారు.

గోవాడ షుగర్స్‌ మాజీ ఎండీ సుధాకర చౌదరి మృతి
సుధాకర చౌదరి(ఫైల్‌)

చోడవరం, మే 11 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ మాజీ ఎండీ రావి సుధాకర చౌదరి(80) ఆదివారం రాత్రి మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందారు. 1987 నుంచి 1991 వరకు గోవాడ ఫ్యాక్టరీ ఎండీగా పనిచేసిన ఆయన ఫ్యాక్టరీ పురోభివృద్ధికి చర్యలు చేపట్టి చెరకు రైతులకు దగ్గరయ్యారు. ఆయన హయాంలోనే గోవాడ ఫ్యాక్టరీ క్రషింగ్‌ సామర్థ్యం 1,400 టన్నుల నుంచి 2,500 టన్నులకు పెంచి ఫ్యాక్టరీ అభివృద్ధికి బాటలు వేశారు. ఆయన హయాంలోనే రైతులకు ఉచితంగా దవ్వ సరఫరాతో పాటు ఎరువుల పంపిణీ, ఇతర ప్రోత్సాహకాలకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో చేపట్టిన సంస్కరణలతో ఫ్యాక్టరీ క్రమంగా ప్రగతి పట్టాలెక్కింది. తరువాత ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చెల్లూరు షుగర్‌ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్‌గా నియమితులయ్యారు. తరువాత 2014లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సహకార షుగర్‌ ఫ్యాక్టరీల పునరుజ్జీవానికి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో సభ్యునిగా ఆయన నియమితులయ్యారు. ఆ సందర్భంలోనే గోవాడ ఫ్యాక్టరీ అభివృద్ధికి చేపట్టవలసిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. గోవాడ ఫ్యాక్టరీలో ఎండీగా ఆయన పనిచేసింది కేవలం నాలుగు సంవత్సరాలే అయినప్పటికీ గోవాడ ప్రాంత చెరకు రైతులు, ఈ ప్రాంత రాజకీయ నాయకులతో చక్కని అనుబంధం ఏర్పడింది. ఆయన మృతిచెందిన సమాచారం తెలియడంతో గోవాడ ఫ్యాక్టరీ కార్మిక నాయకులు భాస్కరరావుతో పాటు పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.

Updated Date - May 12 , 2026 | 12:43 AM