Share News

మాజీ కౌన్సిలర్‌ ఆత్మహత్య

ABN , Publish Date - May 06 , 2026 | 12:49 AM

రెండు రోజుల క్రితం అదృశ్యమైన మాజీ కౌన్సిలర్‌ వర్రి శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారు. కోటవురట్ల మండలం ఎండపల్లి వద్ద ఏలేరు కాలువలో మంగళవారం ఆయన మృతదేహం బయటపడింది. ఇందుకు సంబంధించి ఇతని భార్య, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలిలా వున్నాయి.

మాజీ కౌన్సిలర్‌ ఆత్మహత్య
వర్రి శ్రీనివాసరావు (ఫైల్‌ ఫొటో)

ఏలేరు కాలువలో శవమై తేలిన శ్రీనివాసరావు

ఆర్థిక ఇబ్బందులే కారణం

నర్సీపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): రెండు రోజుల క్రితం అదృశ్యమైన మాజీ కౌన్సిలర్‌ వర్రి శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారు. కోటవురట్ల మండలం ఎండపల్లి వద్ద ఏలేరు కాలువలో మంగళవారం ఆయన మృతదేహం బయటపడింది. ఇందుకు సంబంధించి ఇతని భార్య, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలిలా వున్నాయి.

నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని జోగినాథునిపాలేనికి చెందిన గొర్లి శ్రీనివాసరావు 2014 మునిసిపల్‌ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2024 సాధారణ ఎన్నికల తర్వాత జనసేన పార్టీలో చేరారు. ఇతను చాలా కాలం నుంచి జీడిపిక్కల వ్యాపారం చేస్తున్నారు. అయితే వ్యాపారంలో నష్టం రావడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఈ క్రమంలో కోటవురట్ల మండలం ఎండపల్లికి చెందిన ఒక మహిళకు దగ్గరయ్యారు. కొంతకాలం తరువాత ఆమెకు భూమిని రాసి ఇచ్చారు. కాగా రెండేళ్ల క్రితం బైక్‌పై వెళుతూ అగనంపూడి వద్ద డివైడర్‌ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు కొనసాగుతున్నాయి. దీనికితోడు అప్పులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మూడున్నర గంటల సమయంలో ఇంటి నుంచి కారులో బయలుదేరి బయటకు వెళ్లిన శ్రీనివాసరావు రాత్రి ఇంటికి తిరిగిరాలేదు. సోమవారం మధ్యాహ్నం కుమారుడు సూర్య సెల్‌ ఫోన్‌కి గూగుల్‌ లోకేషన్‌ షేర్‌ చేసి, ‘సారీ.. నేను ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నాను. మిమ్మల్ని (కుటుంబ సభ్యులను) ఇబ్బంది పెడుతున్నాను’ అని మెసేజ్‌ పెట్టారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది, గూగుల్‌ లోకేషన్‌ షేర్‌ చేసిన ఎండపల్లిలో ఏలేరు కాలువ వద్దకు వెళ్లారు. అక్కడ కాలువ గట్టు మీద కారు, చెప్పులు, టవల్‌, మొబైల్‌ ఫోన్‌ కనిపించాయి. ఫోన్‌ నుంచి చివరి కాల్‌ గొర్లి నూకలక్ష్మితో మాట్లాడినట్టు వుంది. ఆమెకు ఫోన్‌ చేయగా.. స్విచ్ఛాఫ్‌ వచ్చింది. స్థానికులను వాకబు చేయగా.. మధ్యాహ్నం సమయంలో ఒక వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ కాలువ గట్టు మీద అటూఇటూ తిరగడం చూశామని, కొద్దిసేపటి తరువాత అతను కనిపించలేదని చెప్పారు. దీంతో కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించి వుంటాడని భావించి గజఈతగాళ్లతో కాలువలో గాలించారు. చీకటిపడే వరకు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. మళ్లీ మంగళవారం ఉదయం కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నానికి శ్రీనివాసరావు మృతదేహం లభించింది. పోలీసులు వచ్చి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. భార్య రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటవురట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 06 , 2026 | 12:49 AM