Share News

మాజీ కార్పొరేటర్‌ దందా

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:55 AM

జీవీఎంసీకి చెందిన పార్కును ఒక కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)గా సుమారు రూ.30 లక్షలతో అభివృద్ధి చేసింది.

మాజీ కార్పొరేటర్‌ దందా

కార్పొరేట్‌ సంస్థ అభివృద్ధి చేసిన పార్కులోని ‘బాక్స్‌ క్రికెట్‌’ను తన ఆధీనంలో ఉంచుకున్న వైనం

ప్రత్యేకంగా మనిషిని పెట్టి గంటకు రూ.300 చొప్పున వసూలు

రోజుకు పది స్లాట్లు కేటాయింపు

జీవీఎంసీకి స్థానిక యువకుల ఫిర్యాదు

అయినా పట్టించుకోని అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీకి చెందిన పార్కును ఒక కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)గా సుమారు రూ.30 లక్షలతో అభివృద్ధి చేసింది. యువత కోసం అందులో బాక్స్‌ క్రికెట్‌ను కూడా ఏర్పాటుచేసింది. కానీ ఆ బాక్స్‌ క్రికెట్‌ను మాజీ కార్పొరేటర్‌ ఒకరు తన గుప్పిట్లో పెట్టుకుని అక్కడ ఆడుకునేవారి నుంచి గంటకు రూ.300 చొప్పున వసూలుచేసి జేబు నింపుకుంటున్నారు. దీనిపై జీవీఎంసీ అధికారులకు స్థానిక యువత ఫిర్యాదు చేసినా ఇంతవరకూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

జీవీఎంసీ 39వ వార్డులో లక్ష్మీటాకీస్‌ వద్ద పార్కు ఉంది. పార్కు అధ్వానంగా తయారవ్వడంతో పోర్టులో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే ఒక సంస్థ సీఎస్‌ఆర్‌ కింద సుమారు రూ.30 లక్షలతో పార్కును అభివృద్ధి చేసింది. స్థానిక యువత విజ్ఞప్తి మేరకు పార్కులో బాక్స్‌ క్రికెట్‌ను ఏర్పాటుచేసింది. రెండు నెలల కిందట పార్కును స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్‌ చేతులుమీదుగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అయితే అదే ప్రాంతానికి చెందిన మాజీకార్పొరేటర్‌ ఒకరు ఆ పార్కులో ఏర్పాటుచేసిన బాక్స్‌ క్రికెట్‌ను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. బాక్స్‌కు తాళం వేసి తాను నియమించిన మనిషికి అప్పగించారు. బాక్స్‌ క్రికెట్‌లో ఆడుకోవాలనుకునేవారు మాజీ కార్పొరేటర్‌ నియమించిన వ్యక్తికి ఫోన్‌ చేస్తే గంటకు రూ.300 చొప్పున ఫోన్‌పే చేయాలని చెబుతున్నారు. ఆ మొత్తం చెల్లించిన తర్వాత స్లాట్‌ కేటాయిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ పది నుంచి 12 గంటలు వరకు బాక్స్‌ క్రికెట్‌లో స్లాట్‌లను విక్రయిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. జీవీఎంసీకి చెందిన పార్కులో ఆడుకునేందుకు గంటకు రూ.300 వసూలుచేస్తున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే లైటింగ్‌తోపాటు ఇతర నిర్వహణ ఖర్చులు ఎవరు కడతారని ఎదురు ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు. నిర్వహణ ఖర్చులకు గంటకు రూ.20, రూ.30 వసూలుచేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని, ఏకంగా రూ.300 చొప్పున వసూలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై జీవీఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశామని, అయినా స్పందించలేదని వాపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా తనను ఏమీ చేయలేరని మాజీ కార్పొరేటర్‌ అంటున్నారని...దాంతో అడిగినంత డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయం జోనల్‌ కమిషనర్‌ మల్లయ్యనాయుడు వద్ద ప్రస్తావించగా ఇప్పటికే దీనిపై ఫిర్యాదు అందిందని, చర్యలకు ఇంజనీరింగ్‌ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. శుక్రవారం నాటికి బాక్స్‌ క్రికెట్‌కు తాళం వేసి స్వాధీనం చేసుకుంటామన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 12:55 AM