పొరుగు జిల్లాల్లో అటవీ రేంజ్ కార్యాలయాలు
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:20 PM
మండలానికి చెందిన అటవీశాఖ రేంజ్ కార్యాలయాలు ఇతర జిల్లాల్లో కొనసాగుతుండడంతో ఆ శాఖ అధికారులు, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.
శృంగవరపుకోటలో అనంతగిరి ఆఫీసు, దేవరాపల్లిలో జీనబాడు కార్యాలయం
అధికారులు, ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు
అనంతగిరి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మండలానికి చెందిన అటవీశాఖ రేంజ్ కార్యాలయాలు ఇతర జిల్లాల్లో కొనసాగుతుండడంతో ఆ శాఖ అధికారులు, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. అనంతగిరి రేంజ్ కార్యాలయం విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో, జీనబాడు రేంజ్ కార్యాలయం అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో ఉన్నాయి. దీంతో కార్యాలయాలు ఒక చోట, విధులు మరో చోట నిర్వహించాల్సి రావడంతో అధికారులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు.
అనంతగిరి అటవీ రేంజ్ పరిధి 47 వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. లోతేరు, అనంతగిరి, కాశీపట్నం, భీంపోల్, చింతలపూడి సెక్షన్లు, 19 బీట్లు ఉన్నాయి. అనంతగిరి రేంజ్ అధికారి జె.సుధీర్ సెలవుపై ఉండడంతో జీనబాడు రేంజ్ అధికారి ఆర్.రాజాబాబు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే సిబ్బంది కొరత వేధిస్తోంది. అలాగే జీనబాడు రేంజ్ పరిధి 40 వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. వంట్లమామిడి, జీనబాడు సెక్షన్లు, ఐదు బీట్లు ఉన్నాయి. రేంజ్ అధికారి ఆర్.రాజాబాబు ఉండగా, ఇక్కడ కూడా సిబ్బంది కొరత ఉంది. 2022లో జిల్లా ఏర్పాటైన తరువాత అనంతగిరి విస్తీర్ణపరంగా పెద్దది కావడంతో 24 పంచాయతీలను అనంతగిరి, జీనబాడు రేంజ్‌లుగా ఏర్పాటు చేశారు. అయితే ఈ రేంజ్‌ల కార్యాలయాలకు సొంత భవనాలపై అటవీశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో ఇప్పటికీ ఇతర జిల్లాల్లోనే ఇవి కొనసాగుతున్నాయి.
ముందుకు సాగని కార్యాలయాల భవన నిర్మాణాలు
మూడేళ్ల క్రితం టోకూరు పంచాయతీ ములియగుడ వద్ద అనంతగిరి రేంజ్ కార్యాలయ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌ను అటవీ శాఖ ఉన్నతాధికారులు కోరారు. ఈ మేరకు ములియగుడ వద్ద రెండు ఎకరాల స్థలాన్ని రెవెన్యూశాఖ గుర్తించింది. అయితే సాంకేతిక సమస్య కారణంగా అటవీశాఖకు స్థలాన్ని అప్పగించలేదు. కాగా జీనబాడు రేంజ్ కార్యాలయ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించకపోవడం, నిధులు మంజూరుకాకపోవడంతో అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో అద్దె భవనంలో ఈ కార్యాలయం కొనసాగుతోంది.
ఉన్నతాధికారుల ఆదేశాలు అమలయ్యేనా?
అనంతగిరి, జీనబాడులోనే రేంజ్ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని రెండు రోజుల క్రితం అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే స్థల కేటాయింపులు జరపకపోవడం, సొంత భవనాలు లేకపోవడంతో రేంజ్ పరిధిలోనే కార్యాలయాలు ఏర్పాటు సాధ్యమేనా అనే సందేహం కలుగుతోంది. ఆ రెండు రేంజ్‌లకు స్థలాన్ని కేటాయించి సొంత భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తేనే ఇది సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.