త్వరితగతిన అటవీ అనుమతులు మంజూరు
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:43 AM
రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన అటవీ, పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేందుకు అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. రహదారుల నిర్మాణాలు, అటవీ ఆంక్షలు, అనుమతులపై బుధవారం అల్లూరి, పోలవరం జిల్లాలకు చెందిన అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రోడ్లకు సంబంధించిన అటవీ అనుమతుల ప్రక్రియలను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో సర్వేలు, పరిశీలనలు చేయాలన్నారు.
- రహదారుల నిర్మాణంపై చర్యలు చేపట్టాలి
- అధికారులకు కలెక్టర్ ఆదేశం
పాడేరు, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన అటవీ, పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేందుకు అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. రహదారుల నిర్మాణాలు, అటవీ ఆంక్షలు, అనుమతులపై బుధవారం అల్లూరి, పోలవరం జిల్లాలకు చెందిన అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రోడ్లకు సంబంధించిన అటవీ అనుమతుల ప్రక్రియలను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో సర్వేలు, పరిశీలనలు చేయాలన్నారు. ఆయా దశల్లో జరిపే ప్రక్రియలను సైతం సకాలంలో పూర్తి చేయాలన్నారు. వీలైనంత తొందరగా రోడ్ల నిర్మాణానికి అటవీ అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు. అటవీ అనుమతులు మంజూరైన వెంటనే రోడ్ల నిర్మాణ పనులు చేపట్టేలా ఇంజనీరింగ్ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తేనే రోడ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తవుతాయన్నారు. మారుమూల ప్రాంతాలకు రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే అభివృద్ధి చెందుతాయన్నారు. చింతపల్లి మండలం కిటుములు నుంచి చెరువులవేనం వరకు, అనంతగిరి మండలంలో రేవెళ్ల నుంచి గుమ్మకోట వరకు, జీకేవీధి మండలం గాలికొండ నుంచి పెదలంక వరకు నిర్మించే రోడ్లకు సంబంధించిన అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా రెవెన్యూ భూములను కేటాయించాలన్నారు. అలాగే సెల్ టవర్ల నిర్మాణాలకు భూములు కేటాయింపులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి సూకరాజు, పాడేరు ఇన్‌చార్జి డీఎఫ్‌వో మహేశ్వరి, చింతపల్లి డీఎఫ్‌వో నర్సింగరావు, అటవీ, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.