పరాయి పంచన పీఏసీఎస్
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:01 PM
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్) కూడా నిర్వీర్యమయ్యాయి.
39 ఏళ్లుగా ఇదే పరిస్థితి
ప్రస్తుతం పీఆర్ ఇంజనీరింగ్ కార్యాలయంలో కొనసాగింపు
భవనం మరమ్మతులకు గురైనా పట్టించుకునే నాథుడు కరువు
సొంత గూడు ఏర్పాటు చేయాలని సభ్యుల వేడుకోలు
కొయ్యూరు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్) కూడా నిర్వీర్యమయ్యాయి. కొయ్యూరులోని పీఏసీఎస్‌కైతే ఇప్పటి వరకు సొంత గూడు లేదు. 39 ఏళ్లుగా పరాయి పంచన కొనసాగుతోంది.
గత టీడీపీ ప్రభుత్వంలో 1987లో కొయ్యూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో కొయ్యూరులోని కమ్యూనిటీ హాల్‌లో దీనిని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ పీఏసీఎస్‌ను చీడిపాలెం పంచాయతీ సింగవరంలో గల పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలోకి మార్చింది. 3,487 మంది సభ్యులు గల ఈ పీఏసీఎస్‌లో రూ.45.79 లక్షలు మేర మూల ధనం ఉంది. ప్రతీ ఏటా సభ్యులకు సుమారుగా రూ.3.5 కోట్లు మేర రుణాలు ఇస్తారు. అయితే ఇంతటి టర్నోవర్ కలిగిన ఈ పీఏసీఎస్‌కు ఇప్పటికీ సొంత భవనం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న భవనం మరమ్మతులకు గురైంది. ఈ భవనానికి మరమ్మతులు చేయించాలని గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సొంత భవనం కోసం సంఘ కార్యదర్శి నాబార్డుకు ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేకపోయింది.
గాడి తప్పిన వ్యవస్థ
ఈ సొసైటీల నిర్వహణకు 2014కు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పాలక వర్గాలను ఎన్నుకునేవారు. దీని వలన కొన్ని అత్యవసర పనులను పాలకవర్గ నిర్ణయంతో మూలధనం వడ్డీ నిధులు వెచ్చించి చేసేవారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం సొసైటీలపై పట్టు సడలిపోకుండా ఉండేందుకు ఎన్నికల నిర్వహణ జరపకుండా నామినేటెడ్ పాలక వర్గాలను ప్రతీ ఆరు మాసాలకు ఒకసారి కాలపరిమితి పెంచుకుంటూ పాలక వర్గాన్ని కొనసాగించింది. కాగా ఎనిమిదేళ్ల క్రితం వ్యవసాయ సీజన్‌లో దుక్కి, దమ్ము, నూర్పు తదితర అవసరాలకు నామమాత్రపు అద్దె చెల్లించి రైతులు వినియోగించుకునేలా అప్పట్లో ఇచ్చిన ట్రాక్టర్ మరమ్మతులకు గురైనా ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. చింతపల్లి, గూడెంకొత్తవీధి, జి.మాడుగుల, ముంచంగిపుట్టు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం స్పందించి కొయ్యూరు పీఏసీఎస్‌కు సొంత భవనం సమకూర్చడంతో పాటు ట్రాక్టర్‌కు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలని రైతులు కోరుతున్నారు.