Share News

విద్యార్థినులతో వెట్టి చాకిరీ

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:19 AM

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో పిల్లలకు సీటు వస్తే తల్లిదండ్రులు ఎంతో మురిసి పోతారు. చదువు చక్కగా చెబుతారని, క్రమశిక్షణ బాగుంటుందని, పిల్లల పట్ల శ్రద్ధ చూపుతారని భావిస్తారు.

విద్యార్థినులతో వెట్టి చాకిరీ
చపాతీలు తయారు చేస్తున్న విద్యార్థినులు

వంట నుంచి పారిశుధ్య పనుల వరకు..

ఐదు నుంచి తొమ్మిదవ తరగతి బాలికలే బాధితులు

హుకుంపేట కేజీబీవీలో దుస్థితి

హుకుంపేట, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో పిల్లలకు సీటు వస్తే తల్లిదండ్రులు ఎంతో మురిసి పోతారు. చదువు చక్కగా చెబుతారని, క్రమశిక్షణ బాగుంటుందని, పిల్లల పట్ల శ్రద్ధ చూపుతారని భావిస్తారు. అయితే హుకుంపేట కేజీబీవీలో పరిస్థితి భిన్నంగా ఉంది. విద్యార్థినులతో వంట, పారిశుధ్య పనులు చేయిస్తున్న వీడియో బుధవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

హుకుంపేట కేజీబీవీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌ బాలికలతో పనులు చేయిస్తున్నారు. ఐదు నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులతో వంట పనుల నుంచి పారిశుధ్య పనుల వరకు చేయిస్తున్నారని తెలిసింది. ఉపాధ్యాయులకు ఎదురు చెప్పలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక విద్యార్థినులు నలిగిపోతున్నారు. ఈ కేజీబీవీపై ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థినులతో పనులు చేయిస్తున్న వీడియో బుధవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అందరూ అవాక్కయ్యారు. తమతో పనులు చేయించడంతో పాటు ఇది ప్రత్యేక తరగతుల్లో భాగమని ఉపాధ్యాయులు చెబుతున్నారని విద్యార్థినులు చెప్పిన వీడియోపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదివించడానికి పిల్లలను పంపిస్తే ఇలా చేస్తారా? అని ప్రిన్సిపాల్‌ అనితపై మండిపడుతున్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - Oct 01 , 2026 | 12:19 AM