మొక్కల పంపిణీలో మేత!
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:46 PM
గంజాయి సాగు వీడిన గిరిజన రైతులకు ప్రత్యామ్నాయ పంటల ద్వారా జీవనోపాధి కల్పించేందుకు అందించిన మొక్కల్లో అవినీతి మొలకెత్తుతున్నది.
జిల్లా నీటి యాజమాన్య సంస్థ యంత్రాంగం చేతివాటం
కాట్రాక్టర్‌తో కుమ్మక్కు
నాటిన కొద్దిరోజులకే చనిపోతున్న 40 శాతం మొక్కలు
అక్రమాలు బయటపడకుండా రాజీనామా డ్రామా
(ఆంధ్రజ్యోతి- పాడేరు/జీకేవీధి)
గంజాయి సాగు వీడిన గిరిజన రైతులకు ప్రత్యామ్నాయ పంటల ద్వారా జీవనోపాధి కల్పించేందుకు అందించిన మొక్కల్లో అవినీతి మొలకెత్తుతున్నది. వీబీ జీరామ్‌జీ ద్వారా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉద్యాన పంటల మొక్కలను పంపిణీ చేస్తున్నది. అయితే అధికారుల చేతివాటం కారణంగా ప్రభుత్వ లక్ష్యం ప్రారంభంలోనే నీరుగారుతున్నది. అధికారులు పంపిణీ చేసిన సిల్వర్ ఓక్ మొక్కలు నాట్లు దశలో 40 శాతం చనిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అధికారుల కాసుల కక్కుర్తి వల్ల సరఫరాదారులు నాసిరకం మొక్కలను పంపిణీ చేస్తూ చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏజెన్సీలో గంజాయి సాగు నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా గిరిజన రైతులకు వీబీ జీరామ్‌జీ ద్వారా ఉద్యాన పంటల మొక్కలను పంపిణీ చేస్తున్నది. ప్రధానంగా సిల్వర్ ఓక్, సీతాఫలం, డ్రాగన్‌ఫ్రూట్, ఆవకాడో, నారింజ, నిమ్మ, చింత, జాఫ్రా మొక్కలను పంపిణీ చేస్తున్నది. ప్రతి ఏడాది 20, 30 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు వీబీ జీరామ్‌జీ పథకం ద్వారా మొక్కలు ఉచితంగా అందజేయడంతోపాటు నాట్లు వేసిన నాటి నుంచి మూడేళ్లపాటు సాగుకు అవసరమైన నిధులను అందజేస్తున్నది. శాస్త్రవేత్తలు, ఉద్యానశాఖ అధికారులు సిఫారసు చేసిన మొక్కలను రైతులకు అందజేయాలి. మొక్కల సరఫరా టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్, నాణ్యత కలిగిన మొక్కలను అందజేయాల్సి ఉంది. కాని వీబీ జీరామ్‌జీ అధికారులు పర్సంటేజీలకు ఆశ పడి, అందుకు భిన్నంగా నాణ్యత ప్రమాణాలు పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. వీబీ జీరామ్‌బీ ద్వారా జూన్ నుంచి ఆగస్టు రెండో పక్షంలోగా మొక్కలు పంపిణీ చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య పర్సంటేజీల పంపకాలు కుదరక ఆలస్యంగా ఈఏడాది సెప్టెంబరులో మొక్కల పంపిణీని ప్రారంభించారు. ఈఏడాది 30 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు అవసరమైన మొక్కలను సరఫరా చేసేందుకు వీబీ జీరామ్‌జీ అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుతం కేవలం సిల్వర్ ఓక్ మొక్కలను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. అవకాడో, డ్రాగన్‌ఫ్రూట్, సీతాఫలం మొక్కల పంపిణీ ఊసేలేదు. ఈఏడాది కొత్తగా వెదురు మొక్కలను పంపిణీ చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎకరానికి మొత్తం 676 మొక్కలు పంపిణీ చేయాలి. వాటిలో 576 సిల్వర్ ఓక్, 52 వెదురు, 48 సీతాఫలం మొక్కలు పంపిణీ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం సిల్వర్‌ఓక్ మొక్కలు మాత్రమే అందించారు.
టెండర్ల నిబంధనలు పాటించని అధికారులు
వీబీ జీరామ్‌జీ పథకం ద్వారా ఉద్యాన పంటల మొక్కలు సరఫరా చేసేందుకు అధికారులు కచ్చితమైన నిబంధనలు పాటించాలి. అవసరమైన మొక్కల సరఫరాకు పత్రికా ప్రకటన ఇవ్వాలి. సరఫరాదారులు టెండర్లలో పేర్కొన్న మొక్కల నాణ్యత, రకాలను ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలించి ఆమోదించాలి. శాస్త్రవేత్తలు, ఉద్యానశాఖ అధికారుల సిఫారసు మేరకు టెండర్లు కేటాయించాలి. వీబీ జీరామ్‌జీ అధికారులు మొక్కుబడిగా పత్రికా ప్రకటన ఇచ్చి, ఇతర నిబంధనలు ఏమీ పాటించలేదు.
అత్యంత నాసిరకం మొక్కలు పంపిణీ
ఈఏడాది నాసిరకం సిల్వర్ ఓక్ మొక్కలను పంపిణీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క రైతుకి కేటాయించిన మొక్కల్లో 40 శాతం నాట్లు దశలోనే చనిపోతున్నాయి. గూడెంకొత్తవీధి మండలంలోని ‘ఆంధ్రజ్యోతి’ పలు రైతులకు సరఫరా చేసిన మొక్కలను పరిశీలించగా.. వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అద్దరవీధిలో మొట్టడం వెంకటరాజుకి పంపిణీ చేసిన మొక్కల్లో సగానికిపైగా చనిపోయాయి. వీబీ జీరామ్‌జీ అధికారులు పిలిచిన టెండర్లలో కాంట్రాక్టర్ కడియం నుంచి మొక్కలను సరఫరా చేస్తామని పేర్కొన్నారు. కాని కేవలం 20 శాతం మాత్రమే కడియం మొక్కలు రైతులకు అందజేసి, మిగిలిన 80 శాతం సిల్వర్ ఓక్ మొక్కలను ఒడిశా నుంచి కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు. సాధారణంగా అడుగున్నర పొడవు కలిగిన మొక్కలు రైతులకు అందజేయాలి. ప్రస్తుతం రెండు, రెండున్నర ఎత్తు కలిగిన నాసిరకం మొక్కలను పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు చేపట్టాలని ప్రత్యేక ప్రాజెక్టును జిల్లాకు మంజూరు చేసింది. వీబీ జీరామ్‌జీ పథకం ద్వారా సిల్వర్ ఓక్ మొక్కలు నాటుకున్న ప్రతి రైతు భవిష్యత్తులో అంతర పంటగా కాఫీ, మిరియాలు పంటలను సాగు చేసుకోవాల్సి ఉంది. ఈ పంటలకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ మొక్కలు పంపిణీ దశలోనే నాణ్యత లేకపోవడంతో కాఫీ సాగుకు ప్రాథమిక దశలోనే బీటలు వారుతున్నాయి. వీబీ జీరామ్‌జీ అధికారుల స్వార్థం కారణంగా గిరిజన రైతులు కాఫీ, మిరియాల సాగుకు దూరమయ్యే దుస్థితి ఏర్పడనుంది.
అక్రమాలు బయటపడకుండా రాజీనామా డ్రామా
మొక్కలు పంపిణీలో జరిగిన అక్రమాలు బయటపడకుండా జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు ఓ ఉద్యోగే అక్రమాలకు కారణమని పేర్కొంటూ ఓ రాజీనామా డ్రామాకు తెర తీశారు. వాస్తవానికి మొత్తం 30 వేల ఎకరాల్లోని ఆయా మొక్కల పంపిణీకి రూ.52 కోట్లు నిధులు కేటాయించగా, టెండరుదారులతో అధికారులు కుమ్మక్కై సుమారుగా రూ.కోటిన్నర సొమ్మును కమిషన్లుగా తీసుకున్నారని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఇందుకు సంబంధించిన వారిపై చర్యలు చేపట్టాలని మౌఖికంగా ఆదేశించారు. అయితే అక్రమ వ్యవహారంపై ఎటువంటి విచారణలు చేపట్టకుండా ముందు జాగ్రత్త చర్యగా జిల్లా నీటి యాజమాన్య సంస్థలో డిస్ట్రిక్ట్ రీసోర్సు పర్సన్‌గా పని చేస్తున్న ఓ ఉద్యోగితో రాజీనామా చేయించేశారు. వాస్తవానికి సదరు ఉద్యోగికి ఈ మొక్కల పంపిణీకి ఎటువంటి సంబంధం లేనప్పటికీ ఈ-ఫైలింగ్, డిజిటల్ కీ వంటివి ఆయన నిర్వహిస్తున్నారనే కారణంతో ఆయన్ను సస్పెండ్ చేసేందుకు తొలుత నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆయన్ని సస్పెండ్ చేస్తే తమ భాగోతం బయటపడుతుందని భావించి, తూతూమంత్రంగా ఉద్యోగానికి రాజీనామా చేయించారు. కాని ఇప్పటికే ఈ వ్యవహారం రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ దృష్టిలో ఉండడంతో దీనిపై జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు రంగంలోకి దిగి, మొక్కల పంపిణీకి సంబంధించి మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేపడితే దీని వెనుకున్న పెద్ద తిమింగళాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.