ఉక్కు ఉన్నతాధికారి కోసం పాలసీనే మార్పు?
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:20 AM
స్టీల్‌ప్లాంటులో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిని రిటైరైన తరువాత కూడా కొనసాగించడానికి ఏకంగా పాలసీనే మారుస్తున్నట్టు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా ఒకరు చాలాకాలంగా పనిచేస్తున్నారు. ఈ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయవలసి ఉంది. ఆయన్ను అదే స్థానంలో కొనసాగించడానికి ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఏకంగా పాలసీనే మార్పు చేస్తున్నట్టు తెలిసింది.
రిటైరైన తరువాత కూడా సీజీఎంగా కొనసాగించేందుకు యత్నం
విస్తుపోతున్న ఉద్యోగ వర్గాలు
వేరే వారికి అవకాశాలు కల్పించకపోవడంపై విమర్శలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటులో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిని రిటైరైన తరువాత కూడా కొనసాగించడానికి ఏకంగా పాలసీనే మారుస్తున్నట్టు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా ఒకరు చాలాకాలంగా పనిచేస్తున్నారు. ఈ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయవలసి ఉంది. ఆయన్ను అదే స్థానంలో కొనసాగించడానికి ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఏకంగా పాలసీనే మార్పు చేస్తున్నట్టు తెలిసింది. స్టీల్ ప్లాంటులో ఒకప్పుడు 50 మంది వరకు సీజీఎంలు ఉండేవారు. ప్రమోషన్లు ఇవ్వకపోవడం, ఉన్నవారు పదవీ విరమణ చేయడంతో వారి సంఖ్య ఇప్పుడు కేవలం రెండుకు పడిపోయింది. ఒకరు ఇప్పుడు పదవీ విరమణ చేస్తే ఇక ఒకరే మిగులుతారు. వాస్తవానికి సీజీఎంగా ప్రమోషన్ పొందేందుకు అనేక మంది అర్హులు ఉన్నారు. వారికి బాధ్యతలు అప్పగించకుండా, ప్రస్తుత అధికారిని కొనసాగించాలనే నిర్ణయాన్ని అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. ప్లాంటులో అనువు గాని సమయంలో బ్లాస్ట్ ఫర్నేస్-3ని ప్రారంభించడం, దాని కోసం బయట భారీగా ముడిసరకులు కొనుగోలు చేయడం, ఉద్యోగులతో రోజుకు 12 గంటల డ్యూటీ చేయించడం వంటి నిర్ణయాలన్నీ ఆయనే తీసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఉత్పత్తి ఆధారిత జీతాలు కూడా ఈ అధికారి ప్రతిపాదనే అని చాలామంది ఆరోపిస్తున్నారు. ఇవన్నీ చట్టవ్యతిరేకమైన నిర్ణయాలు కాబట్టి, వాటిని అమలు చేసిన అధికారిని ఎలా కొనసాగిస్తారంటూ ఇక్కడ సిఫారసు చేయాల్సిన ఒక డైరెక్టర్ ప్రశ్నించినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ విషయాలన్నీ తాము చూసుకుంటామని, కొనసాగింపు ప్రతిపాదనలు ఢిల్లీకి పంపాలని అక్కడి పెద్దలు ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆ డైరెక్టర్ తాను ఈ ప్లాంటులో పనిచేయలేనని, వెనక్కి మాతృ సంస్థకు వెళ్లిపోతానని లేఖ పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ లేఖపై ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకోకుండా సదరు సీజీఎంను కొనసాగించడంపైనే దృష్టిపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. గతంలో ఇన్‌చార్జి సీఎండీగా పనిచేసిన సక్సేనాను ఇలాగే రిటైర్‌మెంట్ తరువాత ఇక్కడే ఉంచాలని యత్నించారని, కానీ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఢిల్లీలో అసలు విషయాలన్నీ చెప్పడంతో ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారని, ఇప్పుడు కూడా నేతలు చొరవ చూపాలని ప్లాంటు వర్గాలు కోరుతున్నాయి.