బడి కోసం..
ABN , Publish Date - Aug 25 , 2026 | 01:17 AM
రాష్ట్ర మానవ వనరులు (విద్య) శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెస్తున్నారు.
దాతల సాయంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి
అందుబాటులోకి వెబ్ పోర్టల్
ప్రధానోపాధాయులకు అవగాహన కార్యక్రమాలు
ప్రతి పాఠశాల అవసరాలు పోర్టల్‌లో నమోదు
కల్పించాల్సి సదుపాయాలపై ఫొటోలు, వీడియోలు సేకరణ
దాతలు, సామాజికవేత్తలు, సోషల్ మీడియా ప్రతినిధులతో హెచ్‌ఎంల సమావేశాలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర మానవ వనరులు (విద్య) శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మెగా పేరెంట్, టీచర్స్ మీట్‌తో ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై బాధ్యత పెంచారు. తాజాగా ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ‘బడి కోసం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన వెబ్ పోర్టల్‌ను ప్రభుత్వం ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు జిల్లా విద్యా శాఖాధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు దాతలు, పారిశ్రామిక సంస్థలను భాగస్వాములను చేసి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ‘బడి కోసం’ వెబ్‌పోర్టల్‌పై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 1,430 ప్రభుత్వ పాఠశాలలు వున్నాయి. ’బడి కోసం’ పోర్టల్ లక్ష్యాలు, వినియోగ విధానం, పాఠశాలల అవసరాలను నమోదు చేయడం, తదితర అంశాలను హెచ్‌ఎంలకు వివరించనున్నారు. ప్రతి పాఠశాల అవసరాలను గుర్తించి పోర్టల్‌లో నమోదు చేసేలా సిబ్బందిని సమన్వయం చేయనున్నారు.
దాతలతో సమావేశాలు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో దాతల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు, దాతలు, సామాజికవేత్తలు, సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ‘బడి కోసం’ కార్యక్రమం ఉద్దేశాలను వారికి వివరించి, సాధ్యమైన రీతిలో పాఠశాలలకు సహకారం అందించాలని కోరనున్నారు. స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు, పూర్వవిద్యార్థులను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులు భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘బడి కోసం’ కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేపట్టడం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. పాఠశాల అవసరాలు, దాతల సహకారం, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తారు. తద్వారా పాఠశాలల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఫొటోలు, వీడియోల సేకరణ
‘బడి కోసం’ కార్యక్రమంలో భాగంగా నర్వహించే ప్రతి సమావేశం, అవగాహన కార్యక్రమం, దాతలతో జరిగే భేటీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తప్పనిసరిగా సేకరించాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా వారంలోగా పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా, ప్రతి పాఠశాలకు అవసరమైన సదుపాయాలను గుర్తించి, వాటిని దాతల ద్వారా కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘బడి కోసం’ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని సమగ్ర శిక్ష ఏపీసీ కె.శ్రీరాములు తెలిపారు. జిల్లాలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.