అమ్మ అనే పిలుపు కోసం!
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:12 AM
ఆడవారికి మాతృత్వం ఓ వరం. అమ్మ అని పిలిపించుకోవాలనే ఆరా టం ప్రతి వివాహితకు ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో చిన్నారుల దత్తతకు 400 మంది ఎదురుచూపు
దరఖాస్తు చేసి, ఆరేళ్లుగా నిరీక్షణ
అందుబాటులో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు
చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్లలో మరో 50 మంది
విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
ఆడవారికి మాతృత్వం ఓ వరం. అమ్మ అని పిలిపించుకోవాలనే ఆరా టం ప్రతి వివాహితకు ఉంటుంది. అయితే వివిధ కారణాలతో అమ్మతనానికి దూరమైన ఎంతోమంది దత్తత తీసుకోవడం ద్వారా అమ్మతనాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారికంగా దత్తత ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. దీంతో పిల్లలను దత్తత తీసుకునేందుకు ఉమ్మడి విశాఖ జిల్లాలో 2015 నుంచి ఇప్పటివరకు సుమారు 570 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో సుమారు 170 మందికి పిల్లలను దత్తత ఇచ్చిన అధికారులు, మిగిలినవారికి అవకాశం వచ్చినప్పుడు అందిస్తామని చెబుతున్నారు.
ప్రస్తుతం దత్తత తీసుకునేందుకు చూస్తున్న వారి సంఖ్యతో పోలిస్తే దత్తత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న చిన్నారుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మర్రిపాలెంలోని శిశుగృహలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు (ఐదేళ్లలోపు) మాత్రమే దత్తత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరిని అర్హులకు దత్తత ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రత్యేక పోర్టల్‌లో...
దత్తత కోసం కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రుల స్థితిగతులు, వారు దరఖాస్తు చేసుకున్నప్పుడు పేర్కొన్న అంశాలు పరిశీలించి చిన్నారులను దత్తత ఇస్తారు. అయితే దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తున్నా అమ్మ అని పిలిపించుకునే అవకాశం లేకుండా పోతోందని పలువురు వాపోతున్నారు.
చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్లలో 50 మంది..
జిల్లాలో 45 చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్లు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వానికి చెందినవి ఆరు కాగా. మరో 39 ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిలో రెండు వేల మంది చిన్నారులు ఉన్నారు. వీరంతా 0 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు. ప్రభుత్వం తాజాగా చైల్డ్‌కేర్ ఇనిస్టిట్యూట్లలో ఉంటున్న వారిని కూడా దత్తత ఇచ్చేందుకు ప్రయత్నించాలని, ఈ మేరకు అనుమతులు తీసుకోవాలని అధికారులకు సూచించింది. ఈ ఇనిస్టిట్యూట్లలో ఉంటున్న వారిలో తల్లి లేదా తండ్రిని కోల్పోయిన అనాథలు, కొందరు ఇద్దరూ లేని వారు ఉన్నారు. వీరికి తాత, నాయనమ్మ, ఇతర బంధువులు ఉన్నప్పటికీ చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్లలోనే ఉంటున్నారు. వారి కుటుంబసభ్యులతో మాట్లాడి దత్తత ఇచ్చేం దుకు ప్రయత్నించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇలా దత్తత ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్న 50 మందిని గుర్తించారు. వీరిని కొద్దిరోజుల్లో అర్హులకు దత్తత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
వయసు సమస్య..
సాధారణంగా దత్తత కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిలో దాదాపు 90 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులను కోరు కుంటున్నారు. ఐదేళ్లు దాటితే పిల్లలకు అన్నింటిపైనా అవగాహన ఉంటుందని, తద్వారా దత్తత తీసుకున్న తల్లిదండ్రులమన్న భావన వారిలో పెరుగుతుందని సంకోచిస్తున్నారు. అదే చిన్నపిల్లలను దత్తత తీసుకుంటే ఇబ్బందులు ఉండవని, సొంత తల్లిదండ్రులుగా భావిస్తారంటున్నారు. ఈ కారణంతో ఐదేళ్లు దాటిన వారిని దత్తత తీసుకునేందుకు చాలామంది ముందుకు రావడం లేదు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో 14 ఏళ్ల బాలుడిని ఓ కుటుంబం దత్తత తీసుకుందని, వారు ఆనందంగా ఉన్నారని, అదే తరహాలో మరింత మంది ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. దత్తత తీసుకోవాలనుకునే తల్లిదండ్రుల వయసు విషయంలో ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. రెండేళ్లలోపు చిన్నారిని దత్తత ఇవ్వాలంటే దంపతుల వయసు 80 ఏళ్లకు మించకూడదు. వారికి నాలుగేళ్లు దాటిన చిన్నారిని మాత్రమే దత్తత ఇస్తారు.