Share News

అందుబాటులోకి ఫుడ్‌ ల్యాబ్‌

ABN , Publish Date - Jan 04 , 2026 | 01:06 AM

నగరంలో మూడేళ్ల క్రితం నిర్మితమైన స్టేట్‌ ఫుడ్‌ లేబొరేటరీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రస్తుతం మైక్రో బయాలజీ ల్యాబ్‌ను ప్రారంభించారు. త్వరలో కెమికల్‌ ల్యాబ్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

అందుబాటులోకి ఫుడ్‌ ల్యాబ్‌

ఇకపై ఆహారంలో నాణ్యత

ఇక్కడే తేలుస్తారు

సుమారు రెండేళ్ల కిందట వర్చువల్‌గా

ల్యాబ్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

నెలలు గడిచినా వినియోగంలోకి తీసుకురావడంపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం

ఎట్టకేలకు అధికారుల్లో కదలిక

సిబ్బంది నియామకం

విశాఖపట్నం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి):

నగరంలో మూడేళ్ల క్రితం నిర్మితమైన స్టేట్‌ ఫుడ్‌ లేబొరేటరీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రస్తుతం మైక్రో బయాలజీ ల్యాబ్‌ను ప్రారంభించారు. త్వరలో కెమికల్‌ ల్యాబ్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే స్టేట్‌ ఫుడ్‌ లేబొరేటరీ ఉండేది. రాష్ట్ర విభజన జరిగి సుమారు పదకొండేళ్లు దాటుతున్నా ఇప్పటివరకూ ఏపీలో స్టేట్‌ ఫుడ్‌ లేబొరేటరీ లేదు. ఎనిమిదేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ల్యాబ్‌ మంజూరుచేసింది. సుమారు రూ.20 కోట్లు వెచ్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెదవాల్తేరులోని ఈఎన్‌టీ ఆస్పత్రి పక్కన ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల ప్రాంగణంలో ల్యాబ్‌ ఏర్పాటుకోసం భవనం నిర్మించారు. మూడేళ్ల కిందటే పనులు పూర్తయ్యాయి. రెండేళ్ల కిందట ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ఈ లేబొరేటరీని ప్రారంభించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సుమారు 15 కోట్ల రూపాయలు విలువజేసే అత్యంత ఖరీదైన పరికరాలు, మరో ఐదు కోట్ల రూపాయలు విలువజేసే కెమికల్‌ కూడా ల్యాబ్‌కు చేరాయి. దీంతో స్టేట్‌ ఫుడ్‌ లేబొరేటరీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అంతా భావించారు. అయితే, పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకాన్ని అధికారులు చేపట్టకపోవడంతో ల్యాబ్‌ నిరుపయోగంగా ఉంది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ నుంచి ఫలితాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేంది. ఫుడ్‌ లేబొరేటరీని ప్రారంభించకపోవడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ కొద్ది నెలల కిందట ‘ఆంధ్రజ్యోతి’ కథనంగా ప్రచురించింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించి ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆదేశాలు జారీచేశారు.

సిబ్బంది బదలాయింపు

ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుతం ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాలలో పనిచేస్తున్న జూనియర్‌ అనలిస్టులను స్టేట్‌ ఫుడ్‌ లేబొరేటరీకి అధికారులు బదలాయించారు. అలాగే గ్రామ/వార్డు సచివాలయాల్లో ఎమ్మెస్సీ కెమిస్ర్టీ అర్హతతో ఉద్యోగాలు చేస్తున్న కొందరిని ఎంపిక చేసి ఈ ల్యాబ్‌కు కేటాయించాలని కూడా నిర్ణయించారు. మొత్తం 40 నుంచి 60 మంది వరకూ అనలిస్టులను నియమించనున్నారు.

ఆరు రకాల పరీక్షలు

ఈ ల్యాబ్‌లో 15 రకాల పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న సిబ్బందితో ఆరు రకాల ఉత్పత్తులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించనున్నారు. పాలు/పాల ఉత్పత్తులు, ఆయిల్‌/ఆయిల్‌ ఫ్యాట్‌, తృణ ధాన్యాలు/పిండి, హోటల్స్‌లో తయారుచేసే ఆహార పదార్థాలు, నీటి పరీక్షలు, టీ, కాఫీ వంటి పౌడర్లకు సంబంధించిన నాణ్యత పరీక్షలను నిర్వహించనున్నారు.

Updated Date - Jan 04 , 2026 | 01:06 AM