Share News

ఫుడ్‌ బ్యాంకులు ప్రారంభం

ABN , Publish Date - Aug 16 , 2026 | 01:10 AM

ఆకలి లేని నగరంగా విశాఖను తీర్చిదిద్దాలంటే ప్రజలతోపాటు దాతల సహకారం అవసరమని ఎంపీ ఎం.శ్రీభరత్‌ అన్నారు.

ఫుడ్‌ బ్యాంకులు ప్రారంభం

అందరి సహకారంతోనే ఆకలి లేని విశాఖ సాధ్యం

ఎంపీ ఎం.శ్రీభరత్‌

విశాఖపట్నం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి):

ఆకలి లేని నగరంగా విశాఖను తీర్చిదిద్దాలంటే ప్రజలతోపాటు దాతల సహకారం అవసరమని ఎంపీ ఎం.శ్రీభరత్‌ అన్నారు. ఆకలితో అలమటించే వారికి ఆహారాన్ని ఉచితంగా అందుబాటులో ఉంచేందుకు నగర పోలీసుల ఆధ్వర్యంలో మద్దిలపాలెం కూడలి వద్ద ఏర్పాటుచేసిన ‘ఫుడ్‌బ్యాంక్‌ కమ్యూనిటీ ఫ్రిడ్జి’ని ఆయన శనివారం సీపీ శంఖబ్రతబాగ్చితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆహారం పొందడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని, ఆకలితో ఉన్నవారికి భోజనం అందించడం గొప్ప సామాజిక బాధ్యత అన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌, మద్దిలపాలెం, గాజువాక వంటి ప్రాంతాల్లో రోడ్లపై ఆకలితో అలమటించేవారు నిత్యం కనిపిస్తుంటారన్నారు. అలాంటి వారికి నాణ్యమైన ఆహారాన్ని ఉచితంగా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో మద్దిలపాలెం, ద్వారకానగర్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌, జగదాంబ కూడలి, గోపాలపట్నం, గాజువాక ప్రాంతాల్లో దాతల సహకారంతో ‘ఫుడ్‌బ్యాంక్‌ కమ్యూనిటీ ఫ్రిడ్జి’లను ప్రారంభించేందుకు సీపీ చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. నగరంలోని హోటళ్లు, కేటరింగ్‌ నిర్వాహకులతోపాటు ప్రజలు కూడా ఫుడ్‌బ్యాంక్‌లకు ఆహారాన్ని అందించాలని కోరారు. అందరి సహకారంతోనే వీటిని నగరంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం సాధ్యమవుతుందన్నారు. అనంతరం ఆకలితో అన్నార్తులకు ఆహారాన్ని అందజేశారు. ఫుడ్‌బ్యాంక్‌కు ఫ్రిడ్జిలను సమకూర్చిన పెప్సీ కంపెనీ ప్రతినిధులతోపాటు ఆహారం సమకూర్చిన దాతలను ఎంపీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 01:10 AM