Share News

కూడళ్లలో ఫుడ్‌ బ్యాంకులు

ABN , Publish Date - Aug 13 , 2026 | 01:15 AM

నగరంలో ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ‘ఆకలి లేని విశాఖపట్నం’ (హంగర్‌ ఫ్రీ వైజాగ్‌) కార్యక్రమానికి పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి శ్రీకారం చుట్టారు.

కూడళ్లలో ఫుడ్‌ బ్యాంకులు

రోడ్లపై తిరిగే నిరాశ్రయుల ఆకలి తీర్చేందుకు సీపీ చొరవ

‘హంగర్‌ ఫ్రీ వైజాగ్‌’ కార్యక్రమానికి 15న శ్రీకారం

నగరంలో ఐదుచోట్ల ఏర్పాటు

అవసరమైనవారు రిఫ్రిజిరేటర్‌ నుంచి తీసుకునేలా సదుపాయం

హోటళ్లు, కేటరింగ్‌ నిర్వాహకులతోపాటు దాతల నుంచి ఆహారం సేకరణ

కంట్రోల్‌రూమ్‌ సీఐకు పర్యవేక్షణ బాధ్యత

దశల వారీగా మిగిలిన ప్రాంతాలకు విస్తరించే యోచన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ‘ఆకలి లేని విశాఖపట్నం’ (హంగర్‌ ఫ్రీ వైజాగ్‌) కార్యక్రమానికి పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి శ్రీకారం చుట్టారు. రోడ్లపై తిరిగే నిరాశ్రయులు, వృద్ధులకు ఎక్కడికక్కడ ఆహారం అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించారు. హోటళ్లు, కేటరింగ్‌ నిర్వాహకులతోపాటు పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆహారం పంపిణీ చేసేందుకు ముందుకువచ్చే వారి సహకారంతో దీనిని నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 15న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

నగరంలోని రహదారులపై బిచ్చగాళ్లతో పాటు మతిస్థిమితం లేనివారు కనిపిస్తుంటారు. కొంతమంది ఆహారం లేక ఆకలితోనే అలమటిస్తుంటారు. అలాంటి వారికి ఆపన్నహస్తం అందించడంతోపాటు నగరంలో ఆకలితో ఇబ్బందిపడేవారు ఒక్కరూ కూడా ఉండకూడదని సీపీ భావించారు. దీనికోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ‘హంగర్‌ ఫ్రీ వైజాగ్‌’ పేరుతో ప్రధాన కూడళ్లలో ఫుడ్‌బ్యాంకులను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కూడలిలో ప్రత్యేకంగా ఒక షెడ్‌మాదిరిగా ఏర్పాటుచేసి అందులో ఒక రిఫ్రిజిరేటర్‌ను పెట్టి, అందులో నాణ్యమైన, తాజా ఆహారాన్ని అందుబాటులో ఉంచితే అపన్నులకు ఉపయోగపడుతుందని సీపీ భావిస్తున్నారు. ప్రతిరోజూ మూడు పూటలా అందులో ఆహారాన్ని ఉంచేలా హోటళ్లు, కేటరింగ్‌ నిర్వాహకుల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. తమ వ్యాపారం కోసం ఆహారం తయారుచేసే సమయంలో అదనంగా కొంత చేసి ఫుడ్‌బ్యాంకులకు అందించేందుకు ముందుకువచ్చేవారిని గుర్తించాలని పోలీస్‌ స్టేషన్‌ల అధికారులకు సూచించారు. అలాగే పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర ప్రత్యేక దినాలు జరుపుకునేవారు ఆహారం పంపిణీ చేయాలనుకుంటే వారి పేరు, సందర్భానికి సంబంధించిన వివరాలను ఫుడ్‌బ్యాంకు వద్ద అందుబాటులో ఉంచే సదుపాయం కల్పిస్తారు.

ముందుగా ఐదుచోట్ల ఏర్పాటు

ఫుడ్‌బ్యాంక్‌లను తొలుత నగరంలో ఐదు ప్రధాన కూడళ్లలో ప్రారంభించాలని సీపీ నిర్ణయించారు. జగదాంబ జంక్షన్‌, ద్వారకానగర్‌ బస్‌స్టేషన్‌, మద్దిలపాలెం, రైల్వే స్టేషన్‌, గాజువాక ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈనెల 15న వీటిని ప్రారంభించి తర్వాత దశల వారీగా నగరంలో అవసరమైన చోట్ల కూడా ఏర్పాటుచేయాలని సీపీ యోచిస్తున్నారు. ఫుడ్‌ బ్యాంకులకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యత కంట్రోల్‌ రూమ్‌ సీఐకు అప్పగించారు. ఫుడ్‌బ్యాంకులకు ఇచ్చే ఆహారం నాణ్యమైనది అయి ఉండాలని, తాజాగా వండిన ఆహారం, ఒక క్రమపద్ధతిలో ప్యాకింగ్‌ చేసి ఇవ్వాలని సూచించారు. మిగిలిపోయిన, పాడైపోయిన, సగం తినేసి వదిలేసిన ఆహారాన్ని ఫుడ్‌బ్యాంక్‌కు తీసుకోబోమని స్పష్టంగా బోర్డులు ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. ఫుడ్‌బ్యాంకుకు ఆహారం ఇవ్వాలనుకునేవారు ఎవరిని సంప్రతించాలి, నియమ నిబంధనలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక మొబైల్‌ నంబర్‌ను కేటాయించి బోర్డులు ఏర్పాటుచేస్తున్నారు.

Updated Date - Aug 13 , 2026 | 01:22 AM