Share News

ఉదయం పొగమంచు.. మధ్యాహ్నం ఎండ

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:45 PM

గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా మన్యంలో విభిన్నమైన వాతావరణం నెలకొంటున్నది.

ఉదయం పొగమంచు.. మధ్యాహ్నం ఎండ
పాడేరు మెయిన్‌రోడ్డులో శుక్రవారం ఉదయం పొగమంచు

మన్యంలో విభిన్న వాతావరణం

పాడేరు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా మన్యంలో విభిన్నమైన వాతావరణం నెలకొంటున్నది. ఏజెన్సీలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. ఆ తర్వాత నుంచి వాతావరణం మారిపోయి ఎండ తీవ్రంగా కాసింది. అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి ఎండ ప్రభావం తగ్గి ఆకాశం మేఘావృతమైంది. ఉదయం శీతాకాలాన్ని మించి దట్టంగా పొగమంచు, మధ్యాహ్నం వేసవిని తలపించే ఎండ కాస్తుండడం విశేషం. వాతావరణ మార్పుల కారణంగా చిన్నారులు, వృద్ధులకు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశముందని వైద్యులు అంటున్నారు.

అరకులోయలో 10.8 డిగ్రీలు

మన్యంలో డబల్‌ డిజిట్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అరకులోయలో 10.8, ముంచంగిపుట్టులో 11.7, పెదబయలులో 13.3, చింతపల్లిలో 14.7, జి.మాడుగులలో 15.2, అనంతగిరిలో 18.2, కొయ్యూరులో 19.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Feb 27 , 2026 | 11:45 PM