కాలుష్య నియంత్రణపై దృష్టి పెట్టండి
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:18 AM
పారిశ్రామికవాడల్లో ఉత్పన్నమయ్యే కాలుష్య వ్యర్థాల నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.
పరిశ్రమల యాజమాన్యాలకు డిప్యూటీ సీఎం కె.పవన్‌కల్యాణ్ ఆదేశం
కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పాటించాలి
అధునాతన సాంకేతికతతో పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ చేపట్టాలి
తీర ప్రాంత రక్షణకు గ్రేట్ గ్రీన్‌వాల్ ప్రాజెక్టు
విశాఖపట్నం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి):
పారిశ్రామికవాడల్లో ఉత్పన్నమయ్యే కాలుష్య వ్యర్థాల నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. నగరంలోని ఒక హోటల్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ‘పర్యావరణం, కాలుష్య నియంత్రణ’ అనే అంశంపై పరిశ్రమల యాజమాన్యాలతో శుక్రవారం సాయంత్రం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ కాలుష్యాన్ని పూర్తిస్థాయిలో నివారించలేకపోయినా నిలువరించే ప్రయత్నం చేయాలన్నారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తూచా తప్పక పాటిస్తూ జీవ వైవిధ్యానికి సహకరించాలన్నారు. నూతన సాంకేతిత సాయంతో వ్యర్థాల నిర్వహణ, గాలి నాణ్యత పెంపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా ఇక్కడి గాలి నాణ్యత తగ్గుతూ వస్తోందన్నారు. గడిచిన రెండేళ్లలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ పరవాడ పారిశ్రామికవాడ పరిధిలోని తాడి గ్రామం వంటి చోట్ల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రసాయన పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం కారణంగా తాడి గ్రామంలో ఇంటికొకరు చొప్పున క్యాన్సర్ బారినపడే దుస్థితి నెలకొందన్నారు. చిన్నారుల్లో చర్మ వ్యాధులు, మహిళల్లో గర్భస్రావాలు, ఊపిరితిత్తుల వ్యాధులు ఆ ప్రాంతంలో సర్వసాధారణంగా మారాయన్నారు. విశాఖ పోర్టు కాలుష్యం కూడా పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై దాడి చేస్తోందన్నారు. బొగ్గు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నాయన్నారు. అక్కడ నివసించే ప్రజలు ఎన్నో సందర్భాల్లో వారి సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చినట్టు వెల్లడించారు. వీటిపై మానవతా దృక్పథంతో స్పందించి బాధితులకు అండగా నిలవాలన్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలని, అయితే, వాటి స్థాపనకు ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవహారంలో నిబంధనలు సరిగా పాటించవన్న భావన ప్రజల్లో ఉందన్నారు. అన్నిరకాల కాలుష్యాలకు ఉత్తరాంధ్రను డంపింగ్ ప్రాంతంగా చేశారంటూ ఇక్కడి ప్రజలు వాపోతుంటారని పేర్కొన్నారు. పరిశ్రమలు వచ్చిన ప్రతిసారి నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు సాటి మనుషుల పట్ల కనీస బాధ్యతతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామికవాడల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కృషిచేయాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో వ్యర్థాల నిర్వహణ చేపట్టి, వారి జీవితాలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.
కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తోందని పవన్‌కల్యాణ్ అన్నారు. అందులో భాగంగానే 50 శాతం గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, మొత్తం ఐదు కిలోమీటర్ల వెడల్పున, మూడు బఫర్ జోన్లుగా విడగొట్టి మొక్కలతో గోడ నిర్మించేందుకు గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును తీసుకువచ్చామన్నారు. ఈ బృహత్తర ప్రణాళికలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములు కావాలన్నారు. గ్రేట్ గ్రీన్‌వాల్ తీర ప్రాంతానికి రక్షణ కల్పిస్తుందని, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు ఈ మహా యజ్ఞంలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు. సమావేశంలో అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య, ఏపీపీసీబీ మెంబర్ సెక్రటరీ శరవణన్, విశాఖ పోర్టు వైస్ చైర్మన్ రోషిని అపరంజి, జిల్లా కలెక్టర్ హరేంధ్రప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, ఏపీపీసీబీ సభ్యులు డాక్టర్ సందీప్ పంచకర్ల, తదితరులు పాల్గొన్నారు.