పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలపై దృష్టి
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:18 PM
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యలపై దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు.
అధికారులకు ఇన్‌చార్జి జేసీ శ్రీపూజ ఆదేశం
పాడే రు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యలపై దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. జిల్లాలోని రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఆయా సమస్యల పరిష్కారంపై మండల స్థాయి అధికారులు ప్రతి రోజూ సమీక్షించాలన్నారు. ఏ స్థాయిలోనూ పెండింగ్ లేకుండా చూసుకోవాలని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాల నుంచి వచ్చే అర్జీలను తక్షణమే పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఆ అంశంలో జిల్లా వెనుకబడిందనే అసహనం వ్యక్తమవుతుందన్నారు. జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని శత శాతం పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న రేషన్ దుకాణాల రెన్యువల్ ఫైళ్లను క్లియర్ చేయాలని ఆదేశించారు. పీఎం జన్‌మన్ పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేయాలని, అవసరమైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలన్నారు. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ రాయితీలు, ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో వినతుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆ రోజు ఆదివారం కావడంతో ముందుగానే పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి, 25న ఓటరు దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, ఇతర అవగాహన కార్యక్రమాలపై ఒక ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్, జిల్లాలోని పదకొండు మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.