స్థానిక ఎన్నికలపై ఫోకస్
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:07 AM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు తమ విధులను అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్ స్పష్టం చేశారు.
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పక పాటించాలి
రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ దిశానిర్దేశం
అనకాపల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు తమ విధులను అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్ స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మునిసిపల్, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఆర్వోలు, ఏఈఆర్వోలు, జిల్లా అధికారులకు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్‌తో కలిసి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పాటించాల్సిన నిబంధనలు, విధివిధానాలపై ఆమె దిశానిర్దేశం చేశారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ప్రతి దశ పకడ్బందీగా జరగాలన్నారు. ప్రతి రిటర్నింగ్ అధికారి అధికారిక హ్యాండ్‌బుక్‌ను పూర్తిగా చదివి, అందులోని ప్రతి నిబంధనను, ఫార్మెట్‌ను అవగతం చేసుకోవాలన్నారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థుల నుంచి రశీదులు, చెక్‌లిస్టులు సక్రమంగా తీసుకోవాలన్నారు. ప్రతిరోజు అందిన నామినేషన్లపై ప్రత్యేక నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. నామినేషన్లను నిర్ణీత తేదీలలో అభ్యర్థులు లేదా వారి అధికారిక ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా పరిశీలించాలన్నారు. నామినేషన్లు తిరస్కరించే సందర్భంలో ఆ నిర్ణయాలను వెంటనే రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థికి తెలియజేయాలని, అభ్యర్థుల అప్పీళ్లకు నిబంధనల ప్రకారం తగిన సమయం ఇవ్వాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో చిన్న పొరపాటు కూడా అధికారి బాధ్యత కిందకే వస్తుందని గుర్తించాలన్నారు.
నియమావళిపై దృష్టి పెట్టండి
ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, డబ్బు, మద్యం, ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపిణీ వంటివి పూర్తిగా నిషేధించామని, వాటిపై దృష్టిపెట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. నగదు రూ.50 వేలు మాత్రమే వ్యక్తి తీసుకెళ్లేందుకు వీలుందని తెలిపారు. రూ.10 వేలు విలువ చేసే బహుమతులు అందించినా, రవాణా జరిగినా తగిన ఆధారాలు ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలు, బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను, కొద్ది మంది ఆధిపత్య వర్గాలు ఓటు వేయకుండా అడ్డుకునే ప్రాంతాలను సున్నితమైన క్లస్టర్లుగా గుర్తించాలని ఆదేశించారు. ఎన్నికల ఉల్లంఘనలు, ప్రతి రోజు నామినేషన్ల వివరాలను సాయంత్రం 6 గంటలలోపు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపాలన్నారు.
ఎన్నికల ప్రచారాలను నిశితంగా పరిశీలించండి
ప్రింట్ మీడియా, ఎలకా్ట్రనిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారా జరిగే క్యాంపెయిన్లను నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ చెప్పారు. సోషల్ మీడియా ప్రచారాలు, పెయిడ్ న్యూస్‌కు అయ్యే ప్రతి ఖర్చును అభ్యర్థుల ఎలక్షన్ ఖర్చు కింద కచ్చితంగా నమోదు చేయాలని చెప్పారు. సాంకేతిక టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, ప్రతిరోజూ కలెక్టర్‌కు నివేదికలు పంపేలా ప్రత్యేక టీమ్ పనిచేయాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డీఆర్వో సత్యనారాయణరావు, జిల్లాలోని ఎంపీడీవోలు, తహశీల్దార్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.