Share News

అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:43 PM

జిల్లాలోని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు.

అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ
శిలాఫలకాలను ఆవిష్కరించిన కలెక్టర్‌ టి.నిషాంతి, పక్కన ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తదితరులు

కలెక్టర్‌ టి.నిషాంతి

రూ.59.51 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

పాడేరు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. స్థానిక ఎన్‌ఆర్‌.శంకరన్‌ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన అసెంబ్లీ స్థానం పరిధిలోని రూ.59.51 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన , ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామన్నారు. ప్రజలకు అవసరమైన రోడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాలు కల్పించడం, మహిళల రక్షణ, భద్రత, కౌన్సెలింగ్‌, పునరావాసం వంటి చర్యలు చేపట్టేందుకు వన్‌స్టాప్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. అంతకు ముందు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ రూ.1.8 కోట్లతో నిర్మించిన వన్‌స్టాప్‌ సెంటర్‌, పంచాయతీరాజ్‌ (ప్రాజెక్ట్సు) ఇంజనీరింగ్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.24.21 కోట్ల వ్యయంతో నిర్మించిన 13 తారు రోడ్లకు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలతో కలిసి కలెక్టర్‌ ప్రారంభోత్సవం చేశారు. అలాగే పాడేరు, చింతపల్లిలో రూ.33.5 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన మల్టీ విలేజ్‌ వాటర్‌ స్కీమ్‌లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ ఈఈలు టి.కొండయ్యపడాల్‌, రామకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ కె.వేణుగోపాల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ బీవీఎస్‌.నాగేశ్వరరావు, రోడ్లు, భవనాల శాఖ ఈఈ సాగర్‌, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, ట్రైకార్‌ డైరెక్టర్‌ కూడ కృష్ణారావు, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, బీజేపీ నేతలు కురుసా ఉమామహేశ్వరరావు, లకే భాస్కరరావు, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 11:43 PM