అవినీతి కట్టడిపై ఫోకస్
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:35 AM
జీవీఎంసీలో అధికారులు, ఉద్యోగుల అవినీతికి చెక్‌పెట్టేందుకు కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రత్యేక దృష్టిసారించారు.
అందుబాటులోకి టోల్‌ఫ్రీ నంబరు 180042500009
సమాచారం ఇస్తే రహస్య విచారణ
బాధ్యులపై శాఖాపరమైన చర్యలు
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
విశాఖపట్నం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీలో అధికారులు, ఉద్యోగుల అవినీతికి చెక్‌పెట్టేందుకు కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రత్యేక దృష్టిసారించారు. అధికారులు, ఉద్యోగులు లంచం డిమాండ్‌చేసినా, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నా ప్రజలు ఫిర్యాదుచేసేందుకు వీలుగా టోల్‌ఫ్రీనంబరు 180042500009ను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడినా, చేయాల్సిన పనిని పూర్తిచేయడంలో జాప్యంచేస్తున్నా అలాంటివారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
జీవీఎంసీ పరిధిలోని ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, నీటిసరఫరా విభాగం, హార్టికల్చర్; యూసీడీ తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులతోపాటు ఉద్యోగులంతా పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేశామన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, దరఖాస్తులపై రెండు రోజులో గా పరిష్కారం చూపాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని పలుమార్లు హెచ్చరించామన్నారు. అయినప్పటికీ కొన్ని విభాగాలపై ఆరోపణలు వస్తుండడంతో టోల్‌ఫ్రీనంబరును అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ నంబరుకు వ చ్చే సమాచారం, ఫిర్యాదులపై రహస్య విచారణ జరుపుతామని, సమాచారం, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులైన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలంతా టోల్‌ఫ్రీ నంబరును సద్వినియోగం చేసుకుని అవినీతి రహిత జీవీఎంసీ రూపకల్పనకు సహకరించాలని కోరారు.