Share News

సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టండి

ABN , Publish Date - Jun 29 , 2026 | 01:03 AM

వర్షాకాలంలో ప్రజలను వేధించే డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా, వైరల్‌ జ్వరాలను సమర్థంగా నియంత్రించేందుకు ముందస్తు కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టండి

జ్వరాల కేసులను ప్రారంభదశలోనే గుర్తించాలి

వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్‌యాదవ్‌

ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

విశాఖపట్నం, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి):

వర్షాకాలంలో ప్రజలను వేధించే డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా, వైరల్‌ జ్వరాలను సమర్థంగా నియంత్రించేందుకు ముందస్తు కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో యాక్టివ్‌ సర్వైలెన్స్‌ నిర్వహించి, జ్వరాల కేసులను ప్రారంభదశలోనే గుర్తించి, తక్షణ వైద్యసేవలు అందించాలన్నారు.

విశాఖ కలెక్టరేట్‌ నుంచి ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీజనల్‌ వ్యాధుల నియంత్రణ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయని, ఈ నేపథ్యంలో ప్రతి గ్రామం, వార్డుస్థాయిలో ఆరోగ్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టి జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించి పరీక్షలు చేయాలన్నారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా కేసులు అధికంగా నమోదయ్యే ప్రాంతాల్లో ముందుగానే ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యా సంస్థలు, అధిక ప్రభావిత గ్రామాల్లో ఇండోర్‌ రెసిడ్యువల్‌ స్ర్పేయింగ్‌, యాక్టివ్‌ డిసీజ్‌ డిటెక్షన్‌, మాస్‌ ఫీవర్‌ సర్వేలు, ఫాగింగ్‌, దోమల నివారణ చర్యలను వేగవంతం చేయాలన్నారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచాలని, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకునేలా గ్రామ, వార్డు సచివాలయాలు, స్థానిక సంస్థలు, పంచాయతీల సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టే చర్యలను కచ్చితంగా అమలుచేయాలన్నారు.

మందులపై ముందస్తు ప్రణాళిక

ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, పరీక్షా కిట్లు, ర్యాపిడ్‌ డయోగ్నోస్టిక్‌ కిట్లు, ఐవీ ఫ్లూయిడ్స్‌, ప్లేట్‌లెట్స్‌పై ముందస్తు ప్రణా ళిక సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాల్లో పరిస్థితిని అధికారులు ప్రతిరోజూ సమీక్షిస్తూ వ్యాధులవ్యాప్తిపై నిఘా కొనసాగించాలన్నారు. జిల్లా యంత్రాంగం, వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌, పరిపాలన, విద్యా, గిరిజన సంక్షేమశాఖాధికారులు సమన్వయంతో పనిచేస్తే సీజనల్‌ వ్యాధులను నియంత్రించవచ్చన్నారు. గిరిజన ప్రాంతా ల్లో మలేరియా నియంత్రణకు గ్రామాలవారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కీటక జనిత వ్యాధుల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌లో అదనపు నిధులు కేటాయించామన్నారు. గత ఏడాది జనవరి నుంచి జూన్‌ 21 వరకు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 12,61,263 మలేరియా పరీక్షలు నిర్వహించగా 3,786 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఈ ఏడాది అదే సమయంలో 12,99,577 మందికి పరీక్షలు నిర్వహించగా, 2,682 మందికి పాజిటివ్‌ వచ్చిందని వివరించారు. 2024తో పోల్చితే 2025లో 750 మలేరియా కేసులు తగ్గాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో రెండో విడత కింద 5,99,624 దోమతెరల పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. తొలివిడత కింద ఇప్పటికే అల్లూరి సీతారా మరాజు, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రజలు 89,845 దోమతెరలు వినియోగిస్తున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. సమీక్షలో ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.


పోలియో రహితంగా భారత్‌

జిల్లాలో 1,76,137 మందికి పోలియో చుక్కలు

విశాఖపట్నం, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి):

దేశాన్ని శాశ్వతంగా పోలియో రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. పారిశ్రామిక ప్రాంతం భవానీ గార్డెన్స్‌ అర్బన్‌ హెల్త్‌సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన పల్స్‌ పోలియో కార్యక్రమంలో మంత్రి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలోపు 49.2 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్క లు వేయిస్తున్నామని, ఇందుకోసం 60 లక్షల పోలియో వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎం.శ్రీభరత్‌, కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌కిశోర్‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 93.1 శాతం పల్స్‌ పోలియో పూర్తయిందని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ లూసీ కార్డీలియో తెలిపారు. 1,89,172 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు వ్యాక్సిన్‌ అందించాల్సి ఉండగా 93.1 శాతంతో 1,76,137 మందికి వ్యాక్సిన్‌ వేశామన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 01:03 AM