వెదురు ఆధార జీవనోపాధిపై శ్రద్ధ
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:17 AM
జిల్లాలో వెదుర ఆధారిత జీవనోపాధుల పెంపునకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు.
కలెక్టర్ టి.నిషాంతి
జిల్లాలో 5 వేల మంది రైతులకు వెదురు మొక్కల పంపిణీకి చర్యలు
పాడేరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వెదుర ఆధారిత జీవనోపాధుల పెంపునకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. వెదురు ఆధారిత జీవనోపాధులపై రాష్ట్ర అటవీ, సెర్ఫ్ అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాడేరు, చింతపల్లి డీఎఫ్‌వోలు ఉమామహేశ్వరి, నరసింహారావు, డీఆర్‌డీఏ పీడీ జి.జయకృష్ణలతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. వెదురు సాగు, స్థిరమైన జీవనోపాధి, విలువ జోడింపు, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 5 వేల మంది రైతులకు వెదురు మొక్కల పంపిణీకి అటవీ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో 3,504 మంది రైతుల నమోదు జరిగిందని, వారికి 2 లక్షల 10 వేల 240 మొక్కలు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటికీ లక్షా 54 వేల 100 మొక్కలు పంపిణీ చేశామన్నారు. వాటి సంరక్షణకు అవసరమైన సలహాలు, సూచనలు, ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. కాగా ఇప్పటికే పెంపకం చేపడుతున్న వెదురును అక్టోబరు మొదటి వారంలో కోతలు చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అందుకు గాను అవసరమైన చర్యలు చేపడుతున్నామని కలెక్టర్, అటవీ శాఖాధికారులు తెలిపారు.