Share News

మలి దశకు ఫ్లైఓవర్‌ వంతెన పనులు

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:54 AM

అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్‌ వంతెన పనులు శర వేగంగా సాగుతున్నాయి. పిల్లర్లు, స్పాన్‌ల నిర్మాణం పూర్తవడంతో వాటిపై ప్రీప్యాబ్రికేటెడ్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ గడ్డర్ల ఏర్పాటు పనులను గురువారం మొదలుపెట్టారు.

మలి దశకు ఫ్లైఓవర్‌ వంతెన పనులు
స్పాన్లపై అమర్చడానికి భారీ ట్రాలీపై తీసుకువచ్చిన ప్రీ-ప్యాబ్రికేటెడ్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ గడ్డర్‌

అచ్యుతాపురం జంక్షన్‌లో పిల్లర్లు, స్పాన్‌ల నిర్మాణం పూర్తి

ప్రీ-ప్యాబ్రికేటెడ్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ గడ్డర్ల ఏర్పాటు ప్రారంభం

అచ్యుతాపురం, ఏప్రిల్‌ 16 (ఆంరఽధజ్యోతి): అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్‌ వంతెన పనులు శర వేగంగా సాగుతున్నాయి. పిల్లర్లు, స్పాన్‌ల నిర్మాణం పూర్తవడంతో వాటిపై ప్రీప్యాబ్రికేటెడ్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ గడ్డర్ల ఏర్పాటు పనులను గురువారం మొదలుపెట్టారు.

అచ్యుతాపురం జంక్షన్‌లో వాహనాల రద్దీ నానాటికీ పెరిగిపోయి, పద్మవ్యూహంలా తయారవడంతో ఇక్కడ ఫ్లైఓవర్‌ వంతెన నిర్మాణానికి గత టీడీపీ హయాంలో నిధులు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించే సమయానికి వైసీపీ అధికారంలోకి వచ్చి, రీటెండర్ల పేరుతో మూడేళ్లపాటు కాలక్షేపం చేసింది. ఎట్టకేలకు 2022 జూన్‌లో టెండర్‌ ప్రక్రియను పూర్తిచేశారు. రెండేళ్లలో వంతెన నిర్మాణం పూర్తిచేయాలన్నది కండిషన్‌. కానీ పనులు చేపట్టడానికి సదరు సంస్థ ముందుకు రాలేదు. 2024 ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో భాగంగా ఇక్కడకు వచ్చిన నారా లోకేశ్‌.. కూటమి అధికారంలోకి రాగానే వంతెనతోపాటు అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే 2025 మార్చి 31న అచ్యుతాపురంలో శంకుస్థాపన చేశారు. వెంటనే రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్‌ వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి.

ఫ్లైఓవర్‌ వంతెన పొడవు 615 మీటర్లు, వెడల్పు 24 మీటర్లు. వంతెనకు 21 పైల్స్‌ (స్తంభాలు), 20 స్పాన్‌లు నిర్మించారు. గురువారం స్పాన్‌లపై గడ్డర్‌లు ఎక్కించే పనులు ప్రారంభించారు. ఒక్కొక్కటి 80 టన్నుల బరువుగల వీటిని సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని చోడపల్లి-కొండకర్ల జంక్షన్‌ల మధ్య ఖాళీ స్థలంలో తయారు చేశారు. అక్కడ నుంచి అచ్యుతాపురం జంక్షన్‌కు భారీ వాహనాలపై తీసుకువచ్చి క్రేన్‌ల సహాయంతో స్పాన్లపైకి ఎక్కిస్తున్నారు. ఒక్కో స్పాన్‌పై ఎనిమిది గడ్డర్లు ఎక్కిస్తారు. అచ్యుతాపురం జంక్షన్‌లో స్పాన్‌ వెడల్పు 40 మీటర్లు వుండడంతో ఇక్కడ 130 టన్నుల బరువున్న గడ్డర్లను ఎక్కిస్తారు. తరువాత గడ్డర్లపై రోడ్డు నిర్మాణం చేపడతారు. గడ్డర్లు ఎక్కించే పని జరుగుతుండడంతో అచ్యుతాపురం జంక్షన్‌ నుంచి పూడిమడక వైపు వేళ్లే రోడ్డును మూసివేశారు. వాహనాలను మండల కాంప్లెక్స్‌, మార్టూరు రోడ్డుమీదుగా మళ్లించారు.

Updated Date - Apr 17 , 2026 | 12:54 AM