ఆనందపురం జంక్షన్‌లో ఫ్లై ఓవర్
ABN , Publish Date - Mar 21 , 2026 | 01:04 AM
ఆనందపురం జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు.
ప్రతిపాదనకు పరిపాలనా ఆమోదం
ఈలోగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక చర్యలు
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
పూల, కూరగాయల మార్కెట్లు అక్కడ నుంచి తరలింపు: కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్
ఆనందపురం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్రరప్రసాద్‌తో కలిసి ఆనందపురం జంక్షన్, పూల మార్కెట్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ మూడు నెలల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఆనందపురం జంక్షన్ కీలకం కానున్నదని, ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎదురుకాకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఇటు నగరం నుంచి, అటు అనకాపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు సాఫీగా ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి సంబంధించిన పనులు వారం, పది రోజుల్లో ప్రారంభించి రెండు నెలల్లో పూర్తిచేస్తామన్నారు. శాశ్వత పరిష్కారంగా ఆనందపురం జంక్షన్‌లో రోడ్డును వెడల్పు చేస్తామని, ఇంకా ఏడాదిన్నర, రెండేళ్లలో సిద్ధమయ్యేలా ప్రతిపాదించిన ఫ్లై ఓవర్ నిర్మాణానికి కూడా పరిపాలనా ఆమోదం లభించిందని ఆయన చెప్పారు. పరిసరాల్లోని స్థలాలను కలిపి పూల మార్కెట్, కూరగాయల మార్కెట్‌లను విశాలమైన పార్కింగ్‌తో నిర్మిస్తామన్నారు. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధర ప్రసాద్ మాట్లాడుతూ జంక్షన్‌లో ట్రాఫిక్‌కు ఆటంకంగా ఉన్న పూల మార్కెట్, కూరగాయల మార్కెట్‌లను అక్కడ నుంచి తరలించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. భీమిలి మార్కెటింగ్ కమిటీ నిర్మించిన యార్డులోకి గాని, పక్కనే ఉన్న ఎస్‌సి కార్పొరేషన్ స్థలంలోకి మార్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆనందపురం జంక్షన్‌లో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం మార్కెట్ యార్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, వి.ఎం.ఆర్.డి.ఎ.చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప, జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ రాజు, ఇంజనీర్లు జగదీష్, గంగరాజు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రామస్వామినాయుడు, చిక్కాల విజయ్‌బాబు, నాయకులు తాట్రాజు అప్పారావు, కోరాడ రాజబాబు, బి.ఆర్.బి.నాయుడు, కాకర వెంకటరమణ, కోరాడ నవీన్ జ్ఙానేశ్వర్, బమ్మిడి ఉమ, లొడగల రమణ, సురాల సత్యవరప్రసాదరావు వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.