రైవాడ రిజర్వాయర్‌కు వరద
ABN , Publish Date - Sep 25 , 2026 | 01:13 AM
శారదా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని రైవాడ జలాశయానికి వరద పోటెత్తింది. సమ్మెద, పినకోట, చల్లగెడ్డల నుంచి గురువారం 1,800 క్యూసెక్కులకుపైబడి ఇన్‌ఫ్లో వుంది.
1,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
రెండు రోజుల్లో 2 మీటర్లు పెరిగిన నీటిమట్టం
దేవరాపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): శారదా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని రైవాడ జలాశయానికి వరద పోటెత్తింది. సమ్మెద, పినకోట, చల్లగెడ్డల నుంచి గురువారం 1,800 క్యూసెక్కులకుపైబడి ఇన్‌ఫ్లో వుంది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లుకాగా మూడు రోజుల క్రితం 102 మీటర్లు వుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో బుధవారం 103 మీటర్లకు చేరింది. అదే రోజు రాత్రి నుంచి క్రమేపీ వరద ప్రవాహం పెరగడంతో గురువారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 1,800 క్యూసెక్కులకు చేరింది. నీటిమట్టం 104 మీటర్లుగా నమోదైంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో రాగల రెండు, మూడు రోజుల్లో నీటిమట్టం 107 మీటర్ల వరకు పెరిగే అవకాశం వుందని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
తాండవ జలాశయానికి 1,900 క్యూసెక్కుల వరద
నాతవరం, సెప్టెంబరు (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తాండవ జలాశయంలోకి ఇన్‌ఫ్లో పెరిగింది. గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు కాగా.. వర్షాలు ప్రారంభం కాకముందు 21వ తేదీన 361 అడుగుల మేర నీటినిల్వలు వున్నాయి. తరువాత వర్షాలు కురుస్తుండడంతో గురువారంనాటికి ఇన్‌ఫ్లో 1,900 క్యూసెక్కులకు చేరింది. దీంతో నీటిమట్టం నాలుగు అడుగులు పెరిగి 365 అడుగులకు చేరింది. కొయ్యూరు, గొలుగొండ మండలాల్లోని పలు గెడ్డలు, వాగుల నుంచి వరద కొనసాగుతుండడంతో నీటి నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉందని తాండవ ప్రాజెక్టు డీఈఈ అనురాధ తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున ఆయకట్టుకు తాత్కాలికంగా నీటి విడుదలను నిలిపివేసినట్టు ఆమె పేర్కొన్నారు.
కోనాం జలాశయంలోకి 1,480 క్యూసెక్కుల వరద
చీడికాడ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కోనాం జలాశయంలో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. గరిష్ఠ నీటిమమట్టం 101.25 మీటర్లుకాగా మూడు రోజుల క్రితం 91 మీటర్లు వుంది. తరువాత నుంచి వర్షాలు కురుస్తుండడం గురువారం 1,480 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో 93.5 మీటర్లకు చేరింది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో నీటి నిల్వలు మరింత పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
పెద్దేరుకు 310 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మాడుగుల రూరల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలం పెద్దేరు జలాశయంలోకి వరద ప్రవాహం పెరిగింది. పరివాహక ప్రాంతమైన ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలతో గురువారం సాయంత్రం 310 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లు. వర్షాల కారణంగా మూడు రోజుల క్రితం 40 క్యూసెక్కులతో ప్రారంభమైన ఇన్‌ఫ్లో.. క్రమేపీ పెరుగుతూ గురువారంనాటికి 310 క్యూసెక్కులకు చేరింది. దీంతో నీటిమట్టం 131.5 మీటర్లకు చేరింది. ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో ఖరీఫ్ సీజన్‌లో ఆయకట్టుకు ఢోకా వుండదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.