Share News

రెండో విడత పంచాయతీ పోరుకు నామినేషన్ల వెల్లువ

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:04 AM

జిల్లాలో రెండో దశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు పదవులకు నావినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. జిల్లాలోని ఎలమంచిలి, మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, కోటవుటర్ల మండలాల్లో బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఎనిమిది మండలాల్లో 213 పంచాయతీల సర్పంచ్‌ పదవులకు, 2,072 వార్డు పదవులకు ఈ నెల 29వ తేదీన పోలింగ్‌ జరగనున్నది. మొత్తం మూడు రోజుల్లో సర్పంచ్‌ పదవులకు 1,170, వార్డులకు 6,120 నామినేషన్లు దాఖలయ్యాయి.

రెండో విడత పంచాయతీ పోరుకు నామినేషన్ల వెల్లువ
పాయకరావుపేట పంచాయతీ సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేసేందుకు వెళుతున్న కూటమి నాయకులు

213 సర్పంచ్‌ స్థానాలకు 1,170 దాఖలు

2,072 వార్డు సభ్యుల స్థానాలకు 6,120 నామినేషన్లు

నేడు పరిశీలన, 24న బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాలు విడుదల

అనకాపల్లి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో రెండో దశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు పదవులకు నావినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. జిల్లాలోని ఎలమంచిలి, మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, కోటవుటర్ల మండలాల్లో బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఎనిమిది మండలాల్లో 213 పంచాయతీల సర్పంచ్‌ పదవులకు, 2,072 వార్డు పదవులకు ఈ నెల 29వ తేదీన పోలింగ్‌ జరగనున్నది. మొత్తం మూడు రోజుల్లో సర్పంచ్‌ పదవులకు 1,170, వార్డులకు 6,120 నామినేషన్లు దాఖలయ్యాయి.

పాయకరావుపేట మండలంలో 24 సర్పంచ్‌ స్థానాలకు 127 నామినేషన్లు, 264 వార్డులకు 788 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎస్‌.రాయవరం మండలంలో 28 సర్పంచులకు 146 నామినేషన్లు 290 వార్డులకు 835 నామినేషన్లు అందాయి. ఎలమంచిలి మండలంలో 17 సర్పంచ్‌ పదవులకు 91 నామినేషన్లు, 146 వార్డులకు 381 నామినేషన్లు దాఖలయ్యాయి. నక్కపల్లి మండలంలో 33 సర్పంచ్‌ పదవులకు 146 నామినేషన్లు, 326 వార్డులకు 971 నామినేషన్లు, మునగపాక మండలంలో 26 సర్పంచ్‌ స్థానాలకు 138 నామినేషన్లు, 250 వార్డులకు 695 నామినేషన్లు, కోటవురట్ల మండంలో 25 సర్పంచ్‌ స్థానాలకు 139 నామినేషన్లు, 240 వార్డులకు 713 నామినేషన్లు, రాంబిల్లి మండలంలో 26 సర్పంచ్‌ స్థానాలకు 158 నామినేషన్లు, 236 వార్డులకు 728 నామినేషన్లు, అచ్యుతాపురం మండలంలో 34 సర్పంచ్‌ స్థానాలకు 225 నామినేషన్లు, 320 వార్డులకు 1,009 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ వుంటుంది. ఈ నెల 24వ తేదీన పోటీలో వున్న అభ్యర్థుల తుది జాబితాలను విడుదల చేస్తారు.

మూడో విడత పంచాయతీల్లో నేటి నుంచి నామినేషన్లు...

జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరగన్ను గ్రామ పంచాయతీల్లో శనివారం నుంచి 61 కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల పరిధిలోని చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, వి.మాడుగుల, గొలుగొండ, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం మండలాల్లో 214 పంచాయతీల సర్పంచ్‌ పదవులకు, 2046 వార్డులకు డిసెంబరు 2న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 3,55,619 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,73,243 మంది పురుషులు, 1,82,376 మంది మహిళలు, ముగ్గురు ఇతరులు వున్నారు.

ఏకగ్రీవం దిశగా..

రెండో దశలో పలు పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు పదవులకు ఒక్కొక్క నామినేషన్‌

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లాలో రెండో దశలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న మండలాల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. పంచాయతీల అభివృద్ధితోపాటు ఎన్నికల్లో అనవసరపు ఖర్చును నివారించడానికి పలుచోట్ల పెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు సమావేశమై, ఏకగ్రీవ ఎన్నికలకు కృషి చేశారు. పలు పంచాయతీల్లో వీరి కృషి ఫలించింది. సర్పంచ్‌, వార్డు పదవులను ఏకగ్రీవం చేయాలని తీర్మానించుకున్నారు. ఈ మేరకు అభ్యర్థులను ఎంపిక చేసి నామినేషన్లు వేశారు. ఈ ప్రక్రియ ముగిసేసరికి పలు పంచాయతీల్లో ఆయా పదవులకు ఒక్కొక్కటి (డమ్మీలు కాకుండా) చొప్పున నామినేషన్లు దాఖలైనట్టు తెలిసింది.

నక్కపల్లి మండలంలోని న్యాయంపూడి, సీహెచ్‌బీ అగ్రహారం పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. న్యాయంపూడి సర్పంచ్‌ పదవికి గోరింట వెంకట రమణ, సీహెచ్‌బీ అగ్రహారం సర్పంచ్‌ పదవికి ఎస్‌కే మీరా పోటీ లేకుండా ఎన్నిక కానున్నట్టు తెలిసింది.

ఎలమంచిలి మండలంలో బయ్యవరం, తురంగలపాలెం పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు పదవులన్నీ ఏకగ్రీవం కానున్నాయి. బయ్యవరం పంచాయతీ సర్పంచ్‌ పదవికి గొన్నాబత్తుల నాగేశ్వరరావు (శేషు), ఆయన సతీమణి గొన్నాబత్తుల సూర్యకళ (డమ్మీ) నామినేషన్‌ దాఖలు చేయగా, గ్రామంలోని 8 వార్డులకు 8 నామినేషన్లు మాత్రమే దాఖలైనాయి. తురంగలపాలెం సర్పంచ్‌ పదవికి శానాపతి త్రినాథరావు, శానాపతి శ్రీనివాసరావు (డమ్మీ) నామినేషన్లు దాఖలు చేశారు. పంచాయతీలోని 8 వార్డులకు 8 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున వీరంతా ఏకగ్రీవం అయినట్టు అధికారులు ప్రకటిస్తారు. మునగపాక మండలం రాజుపేట పంచాయతీ సర్పంచ్‌ పదవికి దుబాసి చంద్రకళ ఒక్కరే నామినేషన్‌ వేశారు. దీంతో ఇక్కడ ఏకగ్రీవం కానున్నది.

కోటవురట్ల మండలంలో కె.వెంకటాపురం పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. టీడీపీ, వైసీపీ నాయకులు ఒక తాటిపైకి వచ్చి సర్పంచ్‌, వార్డు పదవులకు పోటీ లేకుండా ఎన్నుకోవాలని నిర్ణయించున్నారు. దీంతో టీడీపీ సర్పంచ్‌తోపాటు ఆరు వార్డు పదవులు, వైసీపీ ఉపసర్పంచ్‌ పదవితోపాటు ఐదు వార్డు పదవులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సర్పంచ్‌ పదవికి ఇత్తంశెట్టి తిరుమలరావు, ఆయన భార్య (డమ్మీ) మాత్రమే నామినేషన్లు వేసినట్టు తెలిసింది. అత్యంత సమస్యాత్మక గ్రామమైన కె.వెంకటాపురం పంచాయతీ ఏకగ్రీవంకావడంతో అధికారులు ఊరిపిల్చుకున్నారు. కాగా మండలంలోని అన్నవరం, బీకేపల్లి, కోటవురట్ల పంచాయతీలు కూడా ఏకగ్రీవం దిశలో ఉన్నట్టు తెలిసింది.

Updated Date - Nov 21 , 2026 | 01:04 AM