విమానాలు తగ్గింపు
ABN , Publish Date - May 19 , 2026 | 12:42 AM
విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సర్వీస్‌లు క్రమంగా తగ్గిపోతున్నాయి.
ఇంధన కొరత/ధరల నేపథ్యంలో 85 శాతం కంటే తక్కువ
ఆక్యుపెన్సీ కలిగిన మార్గాల్లో సర్వీస్‌లు నిలిపివేత
విశాఖపట్నం విమానాశ్రయంపై ‘భోగాపురం’ ఎఫెక్ట్ కూడా ఉంది
జూన్ నుంచి కర్నూలు, భువనేశ్వర్ విమానాల రద్దు
చెన్నై, కోల్‌కత్తాలకు సర్వీసుల తగ్గింపు
విశాఖపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సర్వీస్‌లు క్రమంగా తగ్గిపోతున్నాయి. పశ్చిమ ఆసియా దేశాల యుద్ధం వల్ల ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పెరిగిన వ్యయాలకు అనుగుణంగా విమానాల టికెట్ ధరలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదు. దాంతో విమాన సంస్థలకు నష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 85 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్న మార్గాల్లో విమానాలు నిలిపివేయాలని ఆయా సంస్థలు ఆదేశిస్తున్నాయి. విశాఖపట్నంలో విమాన సర్వీసుల రద్దుకు మరో కారణం కూడా కనిపిస్తోంది. ఇక్కడికి సమీపానే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. దానిని జూలై లేదా ఆగస్టులో ప్రారంభించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ ఆపరేషన్లు మొదలైతే విశాఖపట్నంలో విమానాశ్రయం మూసివేయాలనే నిబంధన ఉంది. అందుకని విమాన సంస్థలు ముందుగానే తమ షెడ్యూళ్లను సవరించుకుంటున్నాయని విమానాశ్రయం వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం విశాఖపట్నం నుంచి కర్నూలుకు నడుస్తున్న విమానాన్ని జూన్ 30తో ఆపేస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది. అలాగే విశాఖపట్నం నుంచి భువనేశ్వర్‌కు నడుస్తున్న విమానం కూడా జూన్ 12 తరువాత ఉండదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. విశాఖపట్నం నుంచి చెన్నైకి ప్రస్తుతం రోజుకు మూడు విమానాలు నడుస్తుండగా జూన్ నుంచి సెప్టెంబరు వరకు రోజుకు ఒకటి మాత్రమే, అది కూడా సాయంత్రం సమయంలోనే ఉంటుందని ఎయిర్ ట్రావెల్స్ సంస్థలు చెబుతున్నాయి. ఇకపోతే విశాఖ నుంచి కోల్‌కత్తాకు ప్రస్తుతం రోజూ ఒక విమానం నడుస్తోంది. దీనిని జూన్ ఒకటో తేదీ నుంచి వారానికి నాలుగు సార్లు మాత్రమే నడుపుతారని, మిగిలిన మూడు రోజులు అందుబాటులో ఉండదని పేర్కొన్నారు.
వెబ్‌సైట్‌లో టీచర్ల సీనియారిటీ జాబితా
విశాఖపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి జిల్లాలోని జిల్లా, మండల పరిషత్, ప్రభుత్వ, మునిసిపల్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులు, స్కూలు అసిస్టెంట్లు/తత్సమాన ఉపాధ్యాయులు, ఎస్జీటీల సీనియారిటీ జాబితా విడుదల చేశామని సోమవారం విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు. సీనియారిటీ జాబితా విశాఖ జిల్లా డీఈవో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందన్నారు. జాబితాపై అభ్యంతరాలు ఉన్నట్టయితే లిఖిత పూర్వకంగా ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య డీఈవో కార్యాలయంలో అందజేయాలని సూచించారు.