సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ససేమిరా
ABN , Publish Date - Sep 10 , 2026 | 01:40 AM
డిగ్రీ, ఇంజనీరింగ్, తదితర కోర్సులు పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నగర పరిధిలోని పలు కళాశాలల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ఆయా కోర్సుల్లో చేరే ముందు విద్యార్థులు టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లను కాలేజీలకు ఇవ్వాల్సి ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన తరువాత ఆ సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాలు తిరిగి ఇవ్వాలి. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదంటూ అనేక కాలేజీలు ఈ సర్టిఫికెట్లను విద్యార్థులకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి.
విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న కళాశాలల యాజమాన్యాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ కాలేదంటూ మెలిక
విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):
డిగ్రీ, ఇంజనీరింగ్, తదితర కోర్సులు పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నగర పరిధిలోని పలు కళాశాలల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ఆయా కోర్సుల్లో చేరే ముందు విద్యార్థులు టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లను కాలేజీలకు ఇవ్వాల్సి ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన తరువాత ఆ సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాలు తిరిగి ఇవ్వాలి. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదంటూ అనేక కాలేజీలు ఈ సర్టిఫికెట్లను విద్యార్థులకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పెండింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేనివారు ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం నగర పరిధిలో నిర్వహిస్తున్న అగ్నివీర్ ర్యాలీలో పాల్గొంటున్న ఎంతోమంది అభ్యర్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అభ్యర్థులు ర్యాలీ సమయంలో టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఫీజు బకాయిలు ఉన్నారనే కారణంతో సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నగర పరిధిలోని పలు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు అంగీకరించలేదు. దీంతో విద్యార్థులు ఐదు వేలు నుంచి రూ.20 వేలు వరకు ఫీజులను చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఈ తరహా ఇబ్బందులను పలువురు విద్యార్థులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.