జెండా కూలీలు
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:55 AM
జీవీఎంసీలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
ఇంటింటి ప్రచారానికి ముఖం చాటేస్తున్న కార్యకర్తలు
రోజువారీ కూలికి జనాలను సమకూర్చుకుంటున్న అభ్యర్థులు
పగలు నాలుగు గంటల ప్రచారానికి ఒక్కొక్కరికి రూ.300
సాయంత్రం ప్రచారానికి మనిషికి రూ.250
జెండా పడుతున్న వృద్ధులు, మైనర్లు
జీవీఎంసీ ఎన్నికల్లో ప్రధానపార్టీల అభ్యర్థుల తిప్పలు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లినపుడు మందీమార్బలం లేకుండా ఇద్దరు, ముగ్గురుతో వెళితే ఓటర్లలో విశ్వాసం తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో భారీగా జనాలను వెంటేసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంటింటి ప్రచారానికి పార్టీ కార్యకర్తలు రాకపోవడంతో కూలీలపై ఆధారపడుతున్నారు. దీంతో కూలీలకు, ఇంట్లో ఖాళీగా ఉండే మహిళలు, యువతకు డిమాండ్ పెరిగింది.
జీవీఎంసీలో ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరింది. వైసీపీ, కూటమి అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు శక్తియుక్తులు ఒడ్డుతున్నారు. మరోవారం రోజుల్లో పోలింగ్ జరగనుండడంతో ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి, పరిచయం చేసుకోవడంతోపాటు తమకే ఓటు వేయాలని వేడుకుంటున్నారు. ఒంటరిగా లేదా ఇద్దరు ముగ్గురుతో కలిసి వెళితే ప్రజల నుంచి సానుకూల స్పందన రావడం లేదని భావిస్తున్నారు. అంతేకాకుండా తమకు ప్రజల్లో బలం లేదనే సంకేతాలు వెళ్తాయని ఆందోళన చెందుతున్నారు. ప్రత్యర్థులు లేదా ఇతర వార్డుల్లో పోటీచేస్తున్న వారంతా మందీ మార్బలంలో వీధుల్లో ప్రచారం చేస్తున్నట్టు ఫొటోలు, వీడియోలు హల్‌చల్ అవుతుండడంతో తాము కూడా అదే మాదిరిగా ప్రచారం చేయాల్సిందేనని భావిస్తున్నారు. దీనికోసం తమ పార్టీల కార్యకర్తలు, నేతలను ఇంటింటి ప్రచారానికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో రావాలని వేడుకుంటున్నా వారి నుంచి సానుకూలస్పందన రావడం లేదు. ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనులకు వెళితేనేగానీ ఇల్లు గడవదని, దీంతో ప్రచారానికి రాలేమని వారంతా తెగేసి చెప్పేస్తున్నారు. ఓటు మాత్రం మన పార్టీకే వేస్తామని భరోసా ఇస్తున్నారు. దీనివల్ల తమ బలాన్ని ఓటర్ల ముందు ప్రదర్శించడం సాధ్యంకాదు కాబట్టి, వీధుల్లో ఖాళీగా ఉండే మహిళలు, యువతను డబ్బులిచ్చి ప్రచారానికి తీసుకువెళ్లాల్సిందేనని నిర్ణయానికి వస్తున్నారు. కొందరైతే అడ్డాకూలీలను రోజువారీ కూలి చెల్లిస్తామని చెప్పి ప్రచారానికి తీసుకెళుతున్నారు.
అన్నివార్డుల్లో అదే పరిస్థితి
జీవీఎంసీ పరిధిలోని 120వార్డుల్లోనూ కూటమి, వైసీపీ అభ్యర్థులతోపాటు కొందరు ఇండిపెండెంట్‌లు కూడా కూలీలనే ప్రచారానికి తీసుకెళుతుండడంతో కూలీలకు డిమాండ్ పెరిగిపోయింది. సాధారణంగా కూలిపనికి వెళ్లే మగవారికి రోజుకి రూ.వెయ్యి, ఆడవారికైతే రూ.800 చొప్పున ఇస్తుంటే, ఎన్నికల ప్రచారానికి రావాలంటే మగవారికి రూ.1,200, ఆడవారికైతే రూ.వెయ్యి డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే ప్రచారానికి తీసుకెళతారో వారిచ్చే పార్టీ కండువాలను మెడలో వేసుకుని, జెండాలను చేతిలో పట్టుకుని అభ్యర్థులతోపాటు ఇంటింటి ప్రచారానికి వెళుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వృద్ధులు, ఇంటివద్ద ఖాళీగా ఉండే యువత ఉదయం, సాయంత్రం వేళల్లో కేవలం నాలుగు గంటలు చొప్పున ప్రచారానికి తీసుకెళుతున్నారు. ఇలాంటివారికి ఉదయం ఏడు నుంచి 11 గంటల వరకు రూ.300, సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అయితే రూ.250 చొప్పున చెల్లిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వారిలో కొందరు ఇతర ప్రాంతాల వారు కావడంతో వారికి జీవీఎంసీ పరిధిలో ఓటుహక్కు కూడా లేదు. ఇంకా ఓటుకు అర్హత పొందని 17,18 ఏళ్లవయసు కలిగిన మైనర్లు కూడా ప్రచారంలో విస్తృతంగా కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ప్రతిష్ఠాత్మకం
కూటమి మేయరు అభ్యర్థి గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలకు
స్పష్టం చేసిన అధిష్ఠానం
బిజీబిజీగా నగర ప్రజా ప్రతినిధులు
పగలు పర్యటనలు.. రాత్రి సమాలోచనలు
విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత జిల్లా ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గత సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోను కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. గాజువాకలో పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలవగా, భీమిలిలో గంటా శ్రీనివాసరావు కూడా భారీ మెజారిటీతో విజయం సాధించి రాష్ట్రస్థాయిలో మూడోస్థానంలో నిలిచి గుర్తింపు పొందారు. ఇప్పుడు ఈ నాయకులంతా మేయరుగా బరిలో ఉన్న కూటమి (టీడీపీ) అభ్యర్థి ముక్కా శ్రావణిని అదేస్థాయిలో గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారు.
టీడీపీ, జనసేనల మధ్య కార్పొరేటర్ టికెట్ల కేటాయింపులో విభేదాలు తలెత్తినా క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం కనిపించకుండా, సమన్వయంతో అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని అధిష్ఠానం స్పష్టంగా సూచించింది. ఈ నేపథ్యంలో మేయరు అభ్యర్థిని పోటీపడి తమ నియోజకవర్గాలకు తీసుకెళ్లి ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. స్థానిక కార్పొరేటర్‌తో పాటు కూటమి మేయరు అభ్యర్థి శ్రావణికే ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆమె భీమిలి, గాజువాక, తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో ఒక విడత ప్రచారం పూర్తిచేశారు. పెందుర్తిలో కూడా ప్రచారానికి షెడ్యూల్ ఖరారు చేశారు. విద్యావంతురాలు, వైసీపీ హయాంలో టీడీపీ కార్పొరేటర్‌గా ఉత్తర నియోజకవర్గంలో గెలిచి నాటి అధికార పార్టీపై గట్టిగా పోరాటం చేసిన నాయకురాలిగా గుర్తింపు పొందడంతో ఏ నియోజకవర్గానికి వెళ్లినా పార్టీ నాయకులు సహకరిస్తున్నారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి పార్టీ పెద్దల సహకారంతో శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆమె వినమ్రంగా చెప్పడం ఓటర్లను ఆకట్టుకుంటోంది. ఈ ఎన్నికలు తమకు సంబంధం లేదని ఎమ్మెల్యేలు ఇళ్లకు, కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, చీకటి పడగానే సామాజిక వర్గాల సమీకరణ, ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతూ విజయానికి ప్రణాళికలు రచించి, వాటిని పక్కాగా అమలుచేసే పనిలో బిజీగా ఉన్నారు.