చేపల వేట నిషేధ ఆదేశాలకు తూట్లు
ABN , Publish Date - May 21 , 2026 | 01:07 AM
నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి సముద్రంలో చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులను అధికారులు పట్టుకున్నారు. వీరికి నోటీసులు అందజేసి, బోట్ల లైసెన్సులు రద్దు, జరిమానా విధింపుతోపాటు ప్రభుత్వం అందించే రూ.20 వేల మత్స్యకార భరోసాను రద్దు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లా మత్స్యశాఖ అధికారి శృతి తెలిపిన వివరాలిలా వున్నాయి.
రెండో బోట్లను పట్టుకున్న మత్స్య శాఖ సిబ్బంది
జరిమానాతోపాటు బోట్ల లైసెన్సులు, మత్స్యకార భృతి రద్దు
చేపలు తరలిస్తున్న వ్యాన్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఎస్.రాయవరం, మే 20 (ఆంధ్రజ్యోతి): నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి సముద్రంలో చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులను అధికారులు పట్టుకున్నారు. వీరికి నోటీసులు అందజేసి, బోట్ల లైసెన్సులు రద్దు, జరిమానా విధింపుతోపాటు ప్రభుత్వం అందించే రూ.20 వేల మత్స్యకార భరోసాను రద్దు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లా మత్స్యశాఖ అధికారి శృతి తెలిపిన వివరాలిలా వున్నాయి.
సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ఏటా ఏప్రిల్ మూడో వారం నుంచి జూన్ రెండో వారం వరకు చేపల వేటను ప్రభుత్వం నిషేధిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు నెలల కాలంలో మర/ ఇంజన్ బోట్లతో సముద్రంలో చేపల వేట సాగించకూడదు. కానీ రేవుపోలవరం గ్రామానికి చెందిన మత్స్యకారులు సముద్రంలో చేపల వేట సాగిస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో సచివాలయ మత్సశాఖ సిబ్బంది (వీఎఫ్‌ఏ) మంగళవారం అర్ధరాత్రి బంగారమ్మపాలెం సమీపంలోని వాతాడ వద్ద మాటువేసి చేపల వేటకు వెళ్లొచ్చిన రేవుపోలవరం గ్రామానికి చెందిన ఎరిపల్లి అప్పలరాజు, ఎరిపల్లి జగదీశ్‌లకు చెందిన రెండు బోట్లను పట్టుకున్నారు. మొత్తం ఆరుగురు చేపల వేటకు వెళ్లినట్టు గుర్తించారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి సముద్రంలో చేపల వేట సాగించిన మత్స్యకారులకు నోటీసులు జారీ చేస్తామని, తరువాత బోట్ల లైసెన్సుల రద్దు, జరిమానాతోపాటు రేషన్ డీజిల్ కార్డులు రద్దు చేస్తామని జిల్లా మత్స్యశాఖ అధికారి శృతి తెలిపారు. చేపల వేటకు వెళ్లిన ఆరుగురికి ప్రభుత్వం మంజూరు చేసిన మత్స్యకార భరోసాను రద్దు చేస్తామన్నారు. వీరు వేట సాగించి పట్టుకున్న చేపలను తరలించేందుకు వచ్చిన వాహనంపై మెరైన్ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు.