సముద్రంలో చేపల వేట నిషేధం
ABN , Publish Date - Apr 14 , 2026 | 01:20 AM
సముద్రంలో చేపల వేటపై మంగళవారం అర్ధరాత్రి నుంచి నిషేధం అమలులోకి రానుంది.
నేటి అర్ధరాత్రి నుంచి జూన్ 14 వరకు అమలు
ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20 వేల చొప్పున భృతి
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
సముద్రంలో చేపల వేటపై మంగళవారం అర్ధరాత్రి నుంచి నిషేధం అమలులోకి రానుంది. మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ఏటా రెండు నెలలపాటు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధిస్తున్నది. అదే మాదిరిగా ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు నిషేధం విధించింది.
మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ప్రభుత్వం ప్రతి ఏడాది సముద్రంలో రెండు నెలల పాటు చేపలవేట నిషేధాన్ని అమలు చేస్తున్నది. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు 61 రోజులపాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం జిల్లా మత్స్య శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో 28 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 12,402 మత్స్యకార కుటుంబాలు వున్నాయి. వీరు 1,922 మెకనైజ్డ్ బోట్లు, 290 నాన్ మెకనైజ్డ్ బోట్ల ద్వారా సముద్రంలో చేపల వేట సాగిస్తుంటారు. అయితే మత్స్య సంపద పునరుత్పత్తి కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నట్టు ఆయా మత్స్యకార గ్రామాల్లో సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రచారం చేయించారు. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. అయితే కొద్ది రోజుల నుంచి సముద్రంలో మత్స్య సంపద లభ్యత తగ్గిపోవడంతో చాలా మంది మత్స్యకారులు వేటను నిలుపుదల చేశారు. ఇంజన్ బోట్లను, వలలను తీరానికి చేర్చి భద్రపరుస్తున్నారు. కాగా చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నది. గత ఏడాది సముద్రంలో వేట విరామం సమయంలో జిల్లాలో 12,402 మంది మత్స్యకారులకు ప్రభుత్వం సాయం అందించింది. ఈ ఏడాది కూడా సాయం అందించడానికి మత్స్య శాఖ అధికారులు ఆయా మత్స్యకారుల బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు.