నేటి నుంచి చేపల వేటకు విరామం
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:24 PM
సముద్రంలో చేపల వేటకు మంగళవారం అర్ధరాత్రి నుంచి 61 రోజులపాటు ప్రభుత్వం విరామం ప్రకటించడంతో మత్స్యకారులు బోట్లను తీరానికి చేరి ఇంజన్లు, వలలను భద్రపరుస్తున్నారు.
బోట్లను సముద్ర తీరానికి చేరుస్తున్న మత్స్యకారులు
పాయకరావుపేట రూరల్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): సముద్రంలో చేపల వేటకు మంగళవారం అర్ధరాత్రి నుంచి 61 రోజులపాటు ప్రభుత్వం విరామం ప్రకటించడంతో మత్స్యకారులు బోట్లను తీరానికి చేరి ఇంజన్లు, వలలను భద్రపరుస్తున్నారు. సముద్రంలో మత్స్యసంపద పునరుత్పత్తి కోసం ప్రభుత్వం ఏటా ఏప్రిల్ మూడో వారం నుంచి జూన్ రెండో వారం వరకు చేపల వేట నిషేధాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. చేపల వేట నిషేధం గురించి మండలంలోని పెంటకోట, వెంకటనగరం, రాజవరం, గజపతినగరం, పాల్మన్‌పేట, రాజానగరం, రత్నయ్యమ్మపేట, తదితర సముద్ర తీర గ్రామాల్లో మత్స్య శాఖ అధికారులు సచివాలయ సిబ్బంది ద్వారా మత్స్యకారులకు తెలియజేశారు. ఈ సమయంలో చేపల వేటకు వెళితే బోటు లైసెన్సు రద్దు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ అధికారి శ్రుతి హెచ్చరించారు. మండలంలోని సముద్ర తీరగ్రామాల్లో 533 మోటారుబోట్లు ఉన్నాయని, వీటిద్వారా సుమారు 3,500 మంది మత్స్యకారులు చేపల వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారని, వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20 వేల చొప్పున అందిస్తుందని ఆమె చెప్పారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసి బోట్ల పరిశీలన ప్రారంభించామన్నారు.