Share News

15 నుంచి చేపల వేట బంద్‌

ABN , Publish Date - Apr 07 , 2026 | 01:07 AM

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా వేసవిలో చేపల వేటపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

15 నుంచి చేపల వేట బంద్‌

  • 61 రోజులు నిషేధం

  • ఒక్కో కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి):

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా వేసవిలో చేపల వేటపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సముద్రంలో చేపలు వేసవిలో తమ సంతాన పునరుత్పత్తి ప్రక్రియలో ఉంటాయి. ఆ సమయంలో వాటిని వేటాడితే మత్స్య సంపద తగ్గిపోతుందని, ఏటా రెండు నెలలు నిషేధించడం ఆనవాయితీగా వస్తోంది. తూర్పు తీరంలోని ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, పాండిచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవులన్నింటిలోనూ ఈ నెల 15 అర్ధరాత్రి నుంచి జూన్‌ 16వ తేదీ వరకు అంటే 61 రోజులు నిషేధం అమలులో ఉంటుంది. ఆ సమయంలో భారత ప్రాదేశిక జలాల్లోకి మరపడవలు ఏవీ వేటకు వెళ్లకూడదు. ఇంజన్‌ లేని సంప్రదాయ బోట్లు మాత్రం వేటకు వెళ్లవచ్చు. వాటికి మినహాయింపు ఉంది. ఇంజన్‌ బోట్లు అయితే సముద్రంలో ఎక్కువ దూరంలో లోతైన ప్రాంతాల్లో వేట సాగిస్తాయని వాటిపై నిషేధం విధించారు. విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ను కేంద్రంగా చేసుకొని సుమారు 700 మరపడవలు చేపల వేట సాగిస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ 15వ తేదీ నుంచి జెట్టీకి పరిమితం అవుతాయి. ఈ నిషేధం పశ్చిమ తీరంలోని రాష్ట్రాలకు జూన్‌ ఒకటి నుంచి జూలై 31 తేదీ వరకు ఉంటుంది.

మత్స్యకార భరోసా

ఈ వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఉపాధి ఏమీ ఉండదని కుటుంబానికి రూ.20 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద సాయం అందిస్తోంది. విశాఖ జిల్లాలో గత ఏడాది ఈ పథకానికి రూ.12,995 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ ఏడాది కూడా జాబితా సేకరించి, అర్హులైన వారికి సాయం అందిస్తారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.


‘రాక్‌ట్రీ’పై పోలీసులకు హౌసింగ్‌ ఫిర్యాదు

ఇళ్ల నిర్మాణం మధ్యలో విడిచిపెట్టిందని ఆరోపణ

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్టు

సబ్బవరం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి):

పేదల ఇళ్ల నిర్మాణ పనులను మధ్యలో వదిలేసిన ‘రాక్‌ట్రీ’ ఏజెన్సీపై గృహ నిర్మాణ సంస్థ ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘ఇళ్ల నిర్మాణంలో రాక్‌ట్రీ అక్రమాలు’...శీర్షికతో ఈనెల మూడో తేదీన ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాలతో సబ్బవరం పోలీస్‌ స్టేషన్‌లో హౌసింగ్‌ ఈఈ, ఇతర అధికారులు ఫిర్యాదు చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణం రూ.1.8 లక్షలతో పూర్తిచేస్తామని ముందుకువచ్చిన రాక్‌ట్రీ సంస్థ, అర్ధాంతరంగా మధ్యలో వైదొలగిందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నగర శివార్లలో వేసిన లేఅవుట్‌లలో సుమారు 15 వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతలను రాక్‌ట్రీ సంస్థకు గత పాలకులు అప్పగించారు. ఇళ్ల నిర్మాణానికి తీసుకున్న మెటీరియల్‌ దుర్వినియోగం చేసినట్టు, అదనంగా బిల్లులు డ్రా చేసినట్టు విజిలెన్స్‌ విచారణలో వెల్లడైంది. వీటిన్నంటినీ పరిగణనలోనికి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని పోలీసులు వెల్లడించారు.


వాణిజ్య ఆదాయం రూ.1,845.39 కోట్లు

గత ఏడాది కంటే రూ.111.8 కోట్లు అధికం

జాయింట్‌ కమిషనర్‌ పీబీ వల్లీ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి):

వాణిజ్య పన్నుల శాఖ విశాఖపట్నం డివిజన్‌-1...2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,845.39 కోట్లతో రాష్ట్రంలోనే అత్యధిక వసూళ్లను సాధించిందని జాయింట్‌ కమిషనర్‌ పీబీ వల్లీ సోమవారం తెలిపారు. గత ఏడాది అంటే 2024-25లో ఈ వసూళ్లు రూ.1,733.59 కోట్లు మాత్రమేనని, దానికి అదనంగా ఈ ఏడాది రూ.111.8 కోట్లు సాధించామన్నారు. పాత బకాయిల వసూళ్లలో కూడా పురోగతి సాధించామని వివరించారు. 2025 మార్చి నాటికి రూ.150.71 కోట్ల బకాయిలు వసూలు చేయగా, 2026 మార్చి నాటికి రూ.158.59 కోట్లు వసూలు చేశామన్నారు. విశాఖ-1 డివిజన్‌ పరిధిలో భీమిలి, చినవాల్తేరు, డాబాగార్డెన్స్‌, ద్వారకానగర్‌, కురుపాం మార్కెట్‌, సిరిపురం, సూర్యాబాగ్‌ సర్కిళ్లతో పాటు స్పెషల్‌ సర్కిల్‌ కూడా ఉందని, వాటి ద్వారా ఈ ఆదాయం సమకూరిందన్నారు. డివిజన్‌లో ఉద్యోగులందరి సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.


టెన్త్‌ మూల్యాంకనం ప్రారంభం

వాల్యూయేషన్‌ అనంతరం జవాబుపత్రాల స్కానింగ్‌

పొరపాట్లు ఉంటే వెంటనే గుర్తించేందుకు అవకాశం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి):

జ్ఞానాపురంలోని జూబ్లీ ఇంగ్లిష్‌ మీడియం ఉన్నత పాఠశాలలో సోమవారం పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. సుమారు 800 మంది ఉపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పది మంది గైర్హాజరయ్యారు. ప్రతి సబ్జెక్టుకు కొన్ని గదులు కేటాయించారు. తొలిసారిగా మూల్యాంకనం అనంతరం జవాబుపత్రాలను (బుక్‌లెట్‌) స్కానింగ్‌ చేయించారు. ఇందుకోసం 250 ట్యాబ్‌లను అందజేశారు. 24 పేజీల బుక్‌లెట్‌లో విద్యార్థులు రాసిన ప్రతి జవాబుకు మార్కులు వేసిన తరువాత స్కానింగ్‌ చేయాలని ఆదేశాలు వచ్చాయని జిల్లా విద్యాశాఖాఽధికారి ఎన్‌.ప్రేమకుమార్‌ తెలిపారు. దీనివల్ల టీచరు తొందరపాటులో విద్యార్థి రాసిన జవాబును మూల్యాంకనం చేయకపోయినా, మార్కులు పోస్టు చేయకపోయినా వెంటనే గుర్తించవచ్చునన్నారు. మూల్యాంకనం అనంతరం జవాబుపత్రం స్కానింగ్‌ కోసం స్పెషల్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చామన్నారు. కాగా ఉపాధ్యాయుల దీర్ఘకాల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తూ మూల్యాంకనానికి హాజరైన టీచర్లు పలువురు నల్ల బ్యాడ్జీలు ధరించారు.

Updated Date - Apr 07 , 2026 | 01:07 AM