Share News

మత్స్య సంపద

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:41 AM

జిల్లాలో సముద్ర ఉత్పత్తులు ఏటా పెరుగుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యానికి మించి పెద్ద సంఖ్యలో చేపలు, రొయ్యలు, టూనాలు ఫిషింగ్‌ హార్బర్‌కు చేరుతున్నాయి.

మత్స్య సంపద

ఏటా పెరుగుదల

2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ లక్ష్యం 1,44,625 టన్నులు

ఉత్పత్తులు 1,45,005 టన్నులు

టూనాలు మూడేళ్లలో మూడు రెట్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో సముద్ర ఉత్పత్తులు ఏటా పెరుగుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యానికి మించి పెద్ద సంఖ్యలో చేపలు, రొయ్యలు, టూనాలు ఫిషింగ్‌ హార్బర్‌కు చేరుతున్నాయి. విశాఖలో 650 మర బోట్లు, మూడు వేల ఇంజన్‌ పడవలు, టూనా చేపల వేటకు ప్రత్యేకంగా తయారు చేసుకున్న 250 లాంగ్‌ లైనర్లు హార్బర్‌ను కేంద్రంగా చేసుకొని వేట సాగిస్తున్నాయి. నిషేధం ముగిసిన తరువాత చిన్నగా వర్షాలు కురిసే జూన్‌లో వేట మొదలై డిసెంబరు వరకు ఉధృతంగా సాగుతోంది. శీతాకాలంలో ఖరీదైన టూనా చేపలు ఎక్కువగా లభిస్తున్నాయి. వీటి లభ్యత గత మూడేళ్లలో మూడు రెట్లు పెరగడం గమనార్హం. వీటిని పూర్తిగా ఎగుమతి చేస్తూ మత్స్యకారులు మంచి ఆదాయం పొందుతున్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,696 టన్నుల టూనాలు లభ్యం కాగా 2025-26 నాటికి వాటి దిగుబడి 35 వేల టన్నులకు చేరింది. టూనాలు చేపలకు మాదిరిగా వలలకు చిక్కవు. వాటికి ప్రత్యేకంగా కొక్కేలతో తయారుచేసిన గేలాలను కొన్ని కిలోమీటర్ల మేర సముద్రంలో వేసుకుంటూ వెళతారు. వాటిని ఎంత తాజాగా ఒడ్డుకు చేరిస్తే అంత ఎక్కువ ధర లభిస్తుంది. సాధారణ మరపడవలు చేపలు, రొయ్యలతో రెండు వారాల తరువాతే హార్బర్‌కు తిరిగి వస్తాయి. అంతవరకు లభించిన వాటిని ఐస్‌ బాక్సుల్లో భద్రపరుస్తారు. టూనాలను అలా ఆలస్యంగా ఒడ్డుకు తీసుకువస్తే ధర రాదు. అందుకని అవి దొరికిన వెంటనే లాంగ్‌ లైనర్ల నిర్వాహకులు హార్బర్‌కు తీసుకువచ్చి వాటిని ఎగుమతిదారులకు విక్రయిస్తారు. వాటి ద్వారానే ఈ ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల లావాదేవీలు జరిగాయని మత్స్యకార వర్గాల సమాచారం.

ప్రభుత్వం 2023-24లో 1,28,020 టన్నుల మత్స్య సంపద దిగుబడిగా చూపించాలని లక్ష్యం ఇవ్వగా, ఆ ఏడాది 1,35,816 టన్నులు సాధించారు. అందులో టూనాలే 10,696 టన్నులు ఉండడం విశేషం. 2024-25లో ప్రభుత్వ లక్ష్యం రూ.1,31,164 టన్నులు కాగా 1,33,294 టన్నులు హార్బర్‌కు వచ్చాయి. తాజాగా ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 1,44,625 టన్నుల లక్ష్యం నిర్దేశించగా మత్స్య శాఖ 1,45,005 టన్నులు సాధించింది. అందులో టూనాలే 35 వేల టన్నులు ఉన్నాయి.

డీప్‌ సీ ఫిషింగ్‌ వల్లే దిగుబడులు

లక్ష్మణరావు, జాయింట్‌ డైరెక్టర్‌, మత్స్య శాఖ

మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సాంకేతిక సహకారం అందిస్తోంది. సముద్రంలో ఎంత దూరం వెళ్లినా, ఎటు వెళుతున్నారో...తీరానికి ఎంత దూరాన ఉన్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి నేవిగేషన్‌, భద్రత పరికరాలు అన్ని బోట్లకు అందజేశారు. అదేవిధంగా మోటార్లు, వలలు, జీపీఎస్‌, ట్రాన్స్‌పాండర్లు కూడా ఇచ్చారు. వాటితో మత్స్యకారులు డీప్‌ సీ ఫిషింగ్‌ చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారు.

Updated Date - Apr 08 , 2026 | 12:41 AM