Share News

మత్స్యకారుల ఆందోళన

ABN , Publish Date - Jul 09 , 2026 | 01:08 AM

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని అందించి తిరిగి వెళుతున్న గనులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్రను బుధవారం మత్స్యకార మహిళలు అడ్డుకున్నారు.

మత్స్యకారుల ఆందోళన

నష్ట పరిహారం సరిపోదంటూ

మంత్రి వాహనాన్ని అడ్డగించిన మహిళలు

విశాఖపట్నం, జూలై 8 (ఆంధ్రజ్యోతి):

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని అందించి తిరిగి వెళుతున్న గనులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్రను బుధవారం మత్స్యకార మహిళలు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డం పడినా ఆగకుండా ఆయన వాహనం మీదకు దూసుకువెళ్లారు. ఫిషింగ్‌ హార్బర్‌లోని మరపడవల సంఘం అసోసియేషన్‌ కార్యాలయంలో నష్టపరిహారం పంపిణీ కార్యక్రమం ఏర్పాటుచేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌, నెలిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి కలిసి అక్కడికి వచ్చారు. ముందు బాధిత కుటుంబాలతో మాట్లాడి, ఆ తరువాత రూ.10 లక్షల చొప్పున ఆరు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అక్కడ బాధిత కుటుంబాలు ఏమీ అనకపోయినా, బయటకు వచ్చి మంత్రి బయలుదేరాక దారిలో మత్స్యకార మహిళలు పలువురు వాహనాలకు అడ్డం పడ్డారు. రూ.పది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని, చాలదని ఆరోపించారు. పోలీసులు వారిని పక్కకు లాగి మంత్రి, ఎమ్మెల్యేల వాహనాలను అక్కడి నుంచి పంపించారు. ఈ సందర్భంగా మత్స్యకార మహిళలు పలువురు విలేకరుల వద్ద తమ ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాట్లో గర్భిణులు, చిన్నపిల్లలు ఉన్నారని, అలాగే కాలు, చేయి ఆడని వృద్ధులు ఉన్నారన్నారు. వారిని కలిసి మాట్లాడి, భరోసా కూడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం సాయం చేసిందంటే...ఆ కుటుంబం దాంతో బాగుపడి తరువాత తరం కూడా చెప్పుకునేలా ఉండాలన్నారు. ఇప్పుడు ఈ సొమ్ముతో పిల్లలకు చదువులు ఎలా చెప్పిస్తారని, ఆ కుటుంబం ఎలా గడుస్తుందని ప్రశ్నించారు. ఆర్థిక సాయం పెంచాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 09 , 2026 | 01:08 AM