Share News

మత్స్యకారుడి హత్య

ABN , Publish Date - Sep 08 , 2026 | 01:01 AM

ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద మత్స్యకార యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి హత్య చేశారు.

మత్స్యకారుడి హత్య

భార్యతో విభేదాలు...

తనను కొందరు చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని సోదరికి చెప్పిన గంటల వ్యవధిలోనే దారుణం

విశాఖపట్నం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):

ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద మత్స్యకార యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి హత్య చేశారు. మృతుడి తల పగిలిపోయి ఉండడంతోపాటు మెడకు నైలాన్‌తాడు బిగించి ఉంది. వన్‌టౌన్‌ పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి (30) కుటుంబం చాలాకాలం కిందట నగరానికి వచ్చి పెయిందొరపేటలో నివాసం ఉంటున్నది. చంటికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతో కొద్దికాలంగా విభేదాలు ఉండడంతో చంటి తన సోదరి మెరుగు అప్పలకొండ ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు తనను చంపేస్తానంటూ కొందరు బెదిరిస్తున్నారని, ఈరోజు తనను చంపేస్తారని తన సోదరికి చెప్పాడు. అదే విషయాన్ని తాను ఉంటున్న ప్రాంతంలో తనకు పరిచయస్తులైన వారితో కూడా చెప్పాడు. ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన చంటి తిరిగి ఇంటికి చేరలేదు. సోమవారం తెల్లవారుజామున హార్బర్‌ సమీపంలోని గంగాలమ్మ తల్లి గుడి సమీపంలో ఒక మృతదేహం ఉందంటూ 112కి ఫోన్‌ రావడంతో వన్‌టౌన్‌ పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. మృతుడు చేపలవేటకు వెళ్లే మైలపల్లి చంటిగా స్థానికులు గుర్తించడంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి సోదరి అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. మృతుడి తల పగిలిపోయి ఉండడం, మెడకు నైలాన్‌తాడు బిగించి ఉండడంతో ఎవరో చంటిపై కక్షతోనే పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది పాల్గొనివుంటారని భావిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడం, మృతుడు సెల్‌ఫోన్‌ వాడకపోవడంతో ఎవరు హత్యకు పాల్పడ్డారనే దానిపై పోలీసులు అంచనాకు రాలేకపోతున్నారు. కుటుంబ సభ్యులతోపాటు స్థానికంగా ఉన్న కొందరిని వివిధ కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


జల వనరుల శాఖ సీఈగా తిరుమలరావు

విశాఖపట్నం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):

జల వనరుల శాఖ ఉత్తర కోస్తా చీఫ్‌ ఇంజనీర్‌గా డోల తిరుమలరావు సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతా కలిసికట్టుగా పనిచేయడం ద్వారా రైతులు, ప్రజలకు మంచి సేవలు అందిస్తామన్నారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు, సిబ్బంది అంకితభావం, నిజాయితీగా పనిచేయాలన్నారు. సీఈ తిరుమలరావును కార్యాలయంలోని డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ బి.శ్రీహరి, ఎస్‌ఈలు పీలా అప్పలనాయుడు, ఆర్‌.రామచంద్రరావు,హెచ్‌.మన్మథరావు, ఈఈలు సీతారామనాయుడు, బి.గోవిందరావు, వై.గన్నిరాజు, డీఈలు లావణ్య, గణేష్‌, రమణమూర్తి, అప్పలనాయుడు, పద్మజ అభినందించారు. రాజమండ్రిలో క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ఎస్‌ఈగా పనిచేస్తున్న తిరుమలరావుకు ఉత్తర కోస్తా సీఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు.


స్థానిక ఎన్నికలకు టీడీపీ ఇన్‌చార్జిగా ఎంఏ షరీఫ్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలకు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జులను నియమించింది. విశాఖ జిల్లా ఇన్‌చార్జిగా సీనియర్‌ నేత, ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్‌, అనకాపల్లి జిల్లాకు గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్‌ నియమితులయ్యారు. అభ్యర్థుల ఎంపిక, నాయకులు, కేడర్‌ మధ్య సమన్వయం, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు.

Updated Date - Sep 08 , 2026 | 01:01 AM