సముద్రంలో పడవ బోల్తా మత్స్యకారుడు గల్లంతు
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:16 AM
మండలంలోని పూడిమడక సముద్ర తీరానికి కొద్ది దూరంలో పడవ బోల్తా పడిన ప్రమాదంతో కొండపాలెం గ్రామానికి చెందిన ఒక మత్స్యకారుడు గల్లంతయ్యాడు. మిగిలిన ఆరుగురు క్షేమంగా ఒడ్డుకు చేరారు. ఈ సంఘటనకు సంబంధించి మత్స్యకారులు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
అచ్యుతాపురం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పూడిమడక సముద్ర తీరానికి కొద్ది దూరంలో పడవ బోల్తా పడిన ప్రమాదంతో కొండపాలెం గ్రామానికి చెందిన ఒక మత్స్యకారుడు గల్లంతయ్యాడు. మిగిలిన ఆరుగురు క్షేమంగా ఒడ్డుకు చేరారు. ఈ సంఘటనకు సంబంధించి మత్స్యకారులు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
పూడిమడక శివారు కొండపాలెం గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు.. గనగళ్ల సత్తియ్య, గనగళ్ల దొడ్డయ్య, వాసుపల్లి సతీశ్, చోడిపల్లి బుజ్జి అలియాస్ అమ్మోరయ్య, యజ్జల సోమయ్య, గనగళ్ల బుజ్జి, వాసుపల్లి నూకరాజు ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో మోటారు పడవపై సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఆరు గంటలు గడిచిన తరువాత చేపల వేట ముగించుకొని తిరిగి బయలుదేరారు. మరో ఐదు నిమిషాల్లో పూడిమడక తీరానికి చేరుకుంటారనగా.. సముద్రం అల్లకల్లోలంగా వుండి, అలల తాకిడి పెరిగి, బోటు తిరగబడిపోయింది. దీంతో మత్స్యకారులంతా నీటిలో పడిపోయారు. వీరిలో ఆరుగురు ఈదుకుంటూ తీరానికి చేరగా, గనగళ్ల సత్తియ్య (45) నీటిలో గల్లంతయ్యాడు. సహచర మత్స్యకారులు బోట్లు వేసుకొని సముద్రంలోకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. చీకటిపడే వరకు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. గల్లంతైన సత్తియ్యకు భార్య, ముగ్గురు పిల్లలు వున్నారు. ఇతని తండ్రి దేముడు కూడా 2012లో చేపల వేటకు వెళ్లి బోల్తాపడడంతో గల్లంతయ్యాడు.