మత్స్యగుండం ముస్తాబు
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:11 PM
పచ్చని కొండల నడుమ కొలువైన మత్స్యలింగేశ్వరస్వామి సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
నేటి నుంచి మూడు రోజులు
శివరాత్రి ఉత్సవాల నిర్వహణ
ఏర్పాట్లు చేసిన అధికారులు, ఉత్సవ కమిటీ
(పాడేరు/హుకుంపేట- ఆంధ్రజ్యోతి)
పచ్చని కొండల నడుమ కొలువైన మత్స్యలింగేశ్వరస్వామి సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రంగా హుకుంపేట మండలం మఠం పంచాయతీ మత్స్యగుండంలోని మత్స్యలింగేశ్వరస్వామి ఆలయం అలరారుతోంది. మత్స్యలింగేశ్వరస్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఏజెన్సీ మండలాల నుంచే కాకుండా మైదాన ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. మత్స్యగుండం గురించి విని 1964 సంవత్సరంలో పాడేరు తహశీల్దార్‌గా పనిచేస్తున్న కుసర్లపాటి సత్యనారాయణ, సత్యవతి దంపతులు దర్శించుకున్నారు. వారికి ఏడాదిలోనే పిల్లలు పుట్టడంతో 1966-67 సంవత్సరంలో గ్రామ పెద్దలు మఠం సన్యాసినాయుడు, చినరామునాయుడు, గ్రామస్థులతో చర్చించి ఆలయ నిర్మాణానికి మట్టిగోడలతో శ్రీకారం చుట్టారు. ఆలయం వద్ద మత్స్యలింగేశ్వరస్వామి, వినాయకుడు, నంది, అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో 2004లో ఏపీ టూరిజం, విశాఖ నగరాభివృద్ధి సంస్థల ఆధర్యంలో రూ.కోటి వెచ్చించి నూతన ఆలయ నిర్మాణం చేపట్టారు. మత్స్యకన్య, త్రిముఖ లింగేశ్వరస్వామి ప్రతిమలతో పాటు సుందరమైన పార్కును ఏర్పాటుచేశారు. తర్వాత 2016-17లో వుడా ఆధ్వర్యంలో రూ.30 లక్షలు వెచ్చించి మత్స్యగుండాన్ని దర్శించేందుకు వీలుగా గెడ్డపై వంతెన, నాగదేవత ఆలయం, వేదిక, పర్యాటకులు కూర్చొనేందుకు బెంచీలు, కమిటీ ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ ప్రహరీగోడ వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు
ఈనెల 14, 15, 16 తేదీల్లో మత్స్యగుండంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వపరంగా పాడేరు ఐటీడీఏ పీవో శ్రీపూజ, ఆర్‌డీవో ఎంవీఎస్.లోకేశ్వరరావు ఉత్సవాల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రత్యేక పారిశుధ్య పనులు, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. ట్రాఫిక్, ఇతర శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా స్థానిక డీఎస్‌పీ అభిషేక్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు స్నానాలు ఆచరించే గుండాల వద్ద ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు నిర్మించారు. ఆదివారం రాత్రంతా భక్తులు జాగారం చేసి సోమవారం తెల్లవారుజామున మత్స్యగెడ్డలో పుణ్య స్నానాలు ఆచరించి మత్స్యలింగేశ్వడిని దర్శించుకుంటారు. భక్తుల సౌకర్యార్థం శని, ఆది, సోమవారాలు మత్స్యగుండం దర్శించే భక్తుల రాకపోకలకు అనువుగా పాడేరు నుంచి మత్స్యగుండానికి 20 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెకర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.