Share News

ఫైర్‌ సేఫ్టీ గ్యాస్‌ సిలిండర్‌ పేలి టెక్నీషియన్‌ మృతి

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:12 AM

ఫార్మా పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలను నివారించడానికి వినియోగించే ఫైర్‌ సేఫ్టీ గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోవడంతో ఒకరు మృతి చెందారు. పరవాడలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సీఐ ఆర్‌.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఫైర్‌ సేఫ్టీ గ్యాస్‌ సిలిండర్‌ పేలి   టెక్నీషియన్‌ మృతి
సూర్యప్రకాశరావు (ఫైల్‌ ఫొటో)

పరవాడ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఫార్మా పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలను నివారించడానికి వినియోగించే ఫైర్‌ సేఫ్టీ గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోవడంతో ఒకరు మృతి చెందారు. పరవాడలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సీఐ ఆర్‌.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పరవాడ పాతమిల్లు సమీపంలోని సేఫ్‌జోన్‌ షాపులో ముమ్మిడి సూర్యప్రకాశరావు (45) సర్వీసు టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఫార్మా పరిశ్రమలకు సరఫరా చేసే ఫైర్‌ సేఫ్టీ గ్యాస్‌ సిలిండర్ల సర్వీసింగ్‌, రీఫిల్లింగ్‌ చేస్తుంటాడు. ఆదివారం మధ్యాహ్నం సిలెండర్‌లోకి డ్రై కెమికల్‌ పౌడర్‌తో పాటు నైట్రోజన్‌ గ్యాస్‌ నింపుతుండగా ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో సూర్యప్రకాశరావుకు తీవ్రగాయాలయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఆదోళన చెంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే వచ్చి, సూర్యప్రకాశరావును ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు పంపారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఇతని స్వస్థలం కాకినాడ. భార్య వనితరత్నం, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 12 , 2026 | 12:12 AM