మాచ్‌ఖండ్‌లో మంటల కలకలం!
ABN , Publish Date - May 23 , 2026 | 11:18 PM
మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్య్కూట్ ఘటన కలకలం రేపింది. విద్యుత్ ఉత్పత్తి తర్వాత వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ యార్డ్ నుంచి బయటకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. అయితే ఊహించని విధంగా వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ యార్డ్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ యార్డ్‌లో షార్ట్ సర్య్కూట్‌తో మంటలు
ప్రాణాలకు తెగించి తోటి వారిని రక్షించుకున్న సిబ్బంది
థ్రిల్లర్ సినిమాను తలపించిన ఘటన
ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు
(ముంచంగిపుట్టు- ఆంధ్రజ్యోతి)
మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్య్కూట్ ఘటన కలకలం రేపింది. విద్యుత్ ఉత్పత్తి తర్వాత వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ యార్డ్ నుంచి బయటకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. అయితే ఊహించని విధంగా వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ యార్డ్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగ వ్యాప్తించడంతో అప్పుడు విధుల్లో ఉన్న కార్మికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బయట నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని రెండో అంతస్తులోకి సైతం మంటలు వ్యాపించడంతో ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే మంటలు, దట్టంగా పొగ అలుముకోవడంతో లోపలున్న కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈక్రమంలోనే పలువురు అపస్మారక స్థితికి చేరగా, మరికొందరు గాయపడ్డారు.
తోటి వారిని రక్షించేందుకు సిబ్బంది సాహసం
మంటల సమయంలో విద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న తమ తోటి వారిని రక్షించేందుకు సిబ్బంది పెద్ద సాహసమే చేశారు. బయట వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ యార్డ్‌లో మొదలైన మంటలు క్షణాల్లోనే విద్యుత్ కేంద్రంలోకి రావడంతో లోపలున్న వారిని ఎలా రక్షించాలనే దానిపై కాసేపు తోటి సిబ్బంది తర్జనభర్జన పడ్డారు. అయినప్పటికీ ఆలస్యం చేయకుండా తొలుత మొదటి అంతస్తు నుంచి మరో మార్గంలో లోపలకు ప్రవేశించి, రెండో అంతస్తులో అప్పటికే పొగ కారణంగా అపస్మారక స్థితిలో, గాయాలైన వారిని గుర్తించి చాకచక్యంగా బయటకు తీసుకువచ్చారు. ఇంకా ఎవరైనా లోపల ఉన్నారనే అనుమానంతో పరిశీలించి ఎవరూ లేరని నిర్థారించుకున్న తర్వాతనే విద్యుత్ కేంద్రం నుంచి అందరూ బయటకు వచ్చారు. వెంటనే బాధితులను ప్రత్యేక వాహనంలో లమతాపుట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.
గతంలోనూ ఇదే తరహా ఘటన...
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో గతంలోనూ ఇదే తరహా ఘటన జరిగిందని ఉద్యోగులు తెలిపారు. 2007లోనూ వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ యార్డ్‌లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో బయట మాత్రమే మంటలు ఎగసిపడ్డాయి. దీంతో జలవిద్యుత్ కేంద్రంలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. ఆ సాంకేతిక సమస్య కారణంగా సుమారు నెల రోజులు విద్యుత్ ఉత్పత్తి జరగలేదు. తాజా ఘటన నేపథ్యంలోనూ మరి కొన్ని రోజులు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం లేదని కార్మికులు అంటున్నారు. ఈ ఘటనకు గల సాంకేతిక కారణాలను అన్వేషించేందుకు జెన్‌కో అధికారులు ఉన్నత స్థాయి విచారణ చేపడతారని ఉద్యోగులు అంటున్నారు. అయితే మాచ్‌ఖండ్ జల విద్యుత్ నిర్మించిన ఏడు దశాబ్దాలు దాటినా ఆధునికీకరణ చేపట్టకపోవడంతో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.