అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:41 PM
అచ్యుతాపురం సెజ్‌లోని ఒక రసాయన పరిశ్రమలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసి పడడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు.
ఎస్‌వీఎస్ పరిశ్రమలో దట్టంగా పొగ, ఎగసిపడిన మంటలు
బయటకు పరుగులు తీసిన ఉద్యోగులు
నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు
రాంబిల్లి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం సెజ్‌లోని ఒక రసాయన పరిశ్రమలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసి పడడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
రాంబిల్లి మండలం పరిధిలోని ఎస్‌వీఎస్ రసాయన పరిశ్రమలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. సోడియం హైడ్రోక్లోరైడ్ రసాయనంపై నీరు పడడంతో మంటలు వ్యాపించాయి. ఈ మంటలు సమీపంలోని సాల్వెంట్ ట్యాంకులకు అంటుకోవడంతో దట్టంగా పొగ రావడంతో పాటు మంటలు ఎగసిపడ్డాయి. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ప్రాణభయంతో వీరంతా కంపెనీ బయటకు పరుగులు తీశారు. మంటలను ఆదుపు చేయడానికి అగ్నిమాపక శకటాలు తీవ్రంగా ప్రయత్నించాయి. పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, అడ్డరోడ్డు ఆర్డీవో రమణ, స్థానిక సీఐ నర్సింగరావు, ఏపీఐఐసీ డీజీఎం సత్యనారాయణ, జడ్‌ఎం నరసింహ, తహశీల్దార్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ప్రమాద తీవ్రత పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.