Share News

రైల్వే స్టేషన్‌లో జరిమానాలు!

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:42 AM

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో వాహనాల పార్కింగ్‌పై పోలీసులు దృష్టి సారించారు.

రైల్వే స్టేషన్‌లో జరిమానాలు!

నో పార్కింగ్‌ జోన్‌లో వాహనం నిలిపితే రూ.500

విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో వాహనాల పార్కింగ్‌పై పోలీసులు దృష్టి సారించారు. ప్లాట్‌ఫారం నంబరు 1 వద్ద, రెండో నంబరు ప్లాట్‌ఫారం గేటు నంబరు 4 వద్ద ద్విచక్ర వాహనాలకు అవసరమైన స్థలం కేటాయించారు. గంటల లెక్కన చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే చాలా మంది స్టేషన్‌కు వచ్చి ఇప్పుడే వచ్చేస్తామంటూ నో పార్కింగ్‌ జోన్‌లో వాహనాలు నిలిపేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి వారికి కొద్దిరోజులుగా అధికారులు రూ.500 జరిమానా వేస్తున్నారు. ముందు ఆయా వాహనాలను అక్కడి నుంచి తీసుకువెళ్లడానికి వీల్లేకుండా ఇనుపగొలుసులు వేస్తున్నారు. వాహన యజమాని వచ్చాక రూ.500 జరిమానా రాసి, ఆ మొత్తం చెల్లించి రశీదు తీసుకువస్తేనే వాహనం ఇస్తున్నారు. నో పార్కింగ్‌లో వాహనాలు లేకుండా చేయడానికి ఈ విధానం అనుసరిస్తున్నామని రైల్వే పోలీస్‌ వర్గాలు తెలిపాయి. జ్ఞానాపురం స్టేషన్‌ వైపు కూడా విశాలమైన పార్కింగ్‌ సదుపాయం కల్పించారు.


సర్‌కు గడువు పొడిగింపు

ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌కు 24 వరకు అవకాశం

31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ

కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌

మహారాణిపేట, జూలై 14 (ఆంధ్రజ్యోతి):

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో బీఎల్వోలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే కార్యక్రమం ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఈ నెల 24లోపు పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ జరుగుతుందని, ఆరోజు నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం వాటి విచారణ, పరిష్కార ప్రక్రియను సెప్టెంబరు 28 వరకు పూర్తి చేసి అక్టోబరు 3న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్టు వివరించారు. ముందు షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరు 22న తుది జాబితా ప్రచురణ జరగాల్సి ఉందని గుర్తు చేశారు. జిల్లాలో ‘సర్‌’ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన సవరణ షెడ్యూల్‌ ప్రకారం వేగంగా పూర్తి చేయడానికి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లినప్పుడు ఓటర్లు పూర్తి సహకారం అందించి అవసరమైన వివరాలు, పత్రాలు సమర్పించాలని కోరారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు సవరించిన షెడ్యూల్‌ను గమనించి ‘సర్‌’ ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇప్పటివరకూ భీమిలి నియోజకవర్గంలో 3,66,574 మంది ఓటర్లు (99.75 శాతం), విశాఖ తూర్పు నియోజకవర్గంలో 2,91,987 మంది (99.92), దక్షిణ నియోజకవర్గంలో మంది 2,17,7,13 (99.96), ఉత్తర నియోజకవర్గంలో 2,84,244 మంది (99.97), పశ్చిమ నియోజకవర్గంలో 2,13,489 మంది (99.81), గాజువాక నియోజకవర్గంలో 3,34,434 మంది (99.9 శాతం) ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తయినట్టు కలెక్టర్‌ వెల్లడించారు.


రిజిస్ట్రేషన్ల డీఐజీగా మన్మథరావు

విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం రిజిస్ట్రేషన్ల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ)గా కె.మన్మథరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ప్రస్తుతం డీఐజీ కార్యాలయంలో మార్కెట్‌ విలువలు, ఆడిట్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పనిచేసిన డీఐజీ జి.బాలకృష్ణ ఐఏఎస్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఆరుగురికి ఐఏఎస్‌ హోదా రాగా వారిలో బాలకృష్ణ ఒకరు. త్వరలోనే ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చి ముస్సోరి శిక్షణకు పంపనున్నారు.

Updated Date - Jul 15 , 2026 | 12:42 AM