Share News

స్పీడ్‌ 40 దాటితే ఫైన్‌!

ABN , Publish Date - Mar 30 , 2026 | 01:31 AM

బైక్‌ కొత్తదని మురిసిపోతున్నారా... కారు జెడ్‌ స్పీడ్‌లో వెళ్తుందని ప్రయత్నించారా... అయితే చలానా కట్టేందుకు సిద్ధంగా ఉండండి.

స్పీడ్‌ 40 దాటితే ఫైన్‌!

నగరంలో వేగ పరిమితి విధింపు

కూర్మన్నపాలెం నుంచి కొమ్మాది వరకు గంటకు 40 కిలోమీటర్లు

కొమ్మాది నుంచి రాజాపులోవ వరకు గంటకు 50 కి.మీలకు అనుమతి

అంతకుమించితే రూ.వెయ్యి జరిమానా

సీపీ శంఖబ్రత బాగ్చి

విశాఖపట్నం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):

బైక్‌ కొత్తదని మురిసిపోతున్నారా... కారు జెడ్‌ స్పీడ్‌లో వెళ్తుందని ప్రయత్నించారా... అయితే చలానా కట్టేందుకు సిద్ధంగా ఉండండి. నగర పరిధిలో గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్తే జేబు గుల్లే. రూ.వెయ్యి చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సీపీ హెచ్చరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలంతా తమ వాహనాలను గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతోనే నడపాలని సీపీ సూచిస్తున్నారు.

నగర పరిధిలోని జాతీయ రహదారి, బీఆర్‌టీఎస్‌, మునిసిపల్‌రోడ్లపై వేగపరిమితి విధించినట్టు సీపీ శంఖబ్రతబాగ్చి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ-మర్రిపాలెం నుంచి కూర్మన్నపాలెం వరకు జాతీయరహదారి ఎన్‌హెచ్‌16పై 50 కిలోమీటర్లు, కూర్మన్నపాలెం నుంచి కొమ్మాది వరకు 40 కిలోమీటర్లు, కొమ్మాది నుంచి రాజాపులోవ జంక్షన్‌ వరకు 50 కిలోమీటర్లు, పినగాడి జంక్షన్‌ నుంచి పెందుర్తి వరకు (జాతీయరహదారి బైపాస్‌) 60 కిలోమీటర్లు, ఫిషింగ్‌హార్బర్‌ నుంచి భీమిలి వరకు బీచ్‌రోడ్డులో 40 కిలోమీటర్లు, అన్ని బీఆర్‌టీఎస్‌రోడ్లపై 40 కిలోమీటర్లు, పెందుర్తి నుంచి బాజీజంక్షన్‌ వరకు 50 కిలోమీటర్లు, నగరంలోని అన్ని మునిసిపల్‌రోడ్లపై గంటకు 40 కిలోమీటర్లు గరిష్ట వేగపరిమితిగా నిర్ణయించామన్నారు.

వాహనచోదకులు తమ వాహనాలను ఆయా రోడ్లపై అనుమతించిన గరిష్ట వేగపరిమితి కంటే తక్కువ వేగంతోనే వాహనాలను నడపాలని సీపీ హెచ్చరించారు. నిర్దేశించిన గరిష్ట వేగపరిమితిని దాటితే ఆయా వాహనాలను ట్రాఫిక్‌ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లేజర్‌గన్‌ ్స ద్వారా గుర్తించి రూ.వెయ్యి జరిమానా విధించడంతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయడానికి రవాణాశాఖ అధికారులకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు.

రాంగ్‌రూట్లలో వాహనాలను నడిపితే రూ.1,500, ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్‌ రైడర్‌) హెల్మెట్‌ ధరించకుంటే రూ.వెయ్యి, ట్రిపుల్‌రైడింగ్‌కు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తామన్నారు. వాహనచోదకులు నిబంధనలను పాటించాలని కోరారు.

Updated Date - Mar 30 , 2026 | 01:31 AM