Share News

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా

ABN , Publish Date - Aug 19 , 2026 | 12:48 AM

ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను క్లాప్‌ వాహనాలకు ఇవ్వకుండా బహిరంగ ప్రదేశాల్లో వేస్తే జరిమానా విధించాలని అధికారులను జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశించారు.

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా

అధికారులకు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశం

విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):

ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను క్లాప్‌ వాహనాలకు ఇవ్వకుండా బహిరంగ ప్రదేశాల్లో వేస్తే జరిమానా విధించాలని అధికారులను జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన 21వ వార్డు పరిధి సిరిపురం సమీపంలోని వెంకటాద్రి వంటిల్లు వెనుక వైపు ఉన్న ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ రోడ్డు పక్కనే స్ర్కాప్‌ మూటలు ఉండడంతో వాటిని అక్కడి నుంచి తొలగించాలని గోడౌన్‌ నిర్వాహకుడిని ఆదేశించారు. వీధులు, కాలనీల్లో తరచూ చెత్త పోగవుతున్న ప్రాంతాలను గుర్తించి వారానికి ఒకరోజు ఆయా ప్రాంతాల్లో స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించి పారిశుధ్యం మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.


22 లేదా 23న సీఎం రాక

విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 22 లేదా 23వ తేదీన నగరానికి వచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు నగరంలోని నోవాటెల్‌ హోటల్‌లో బ్రిక్స్‌ దేశాల క్రీడా మంత్రుల సమావేశం జరగనున్నది. మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ముఖ్యమంత్రి రానున్నారు. అయితే పర్యటన షెడ్యూల్‌ ఖరారు కావలసి ఉంది.


జగన్నాథపురంలో డేటా సెంటర్‌

486 మెగావాట్ల సామర్థ్యంతో హోల్డింగ్స్‌ ఇండియా ఏర్పాటు

కణమాంలో 15 ఎకరాల్లో లాజిస్టిక్స్‌ పార్క్‌

పరవాడలో టాప్‌కాన్‌ సోలార్‌ ప్లాంటు

రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం

విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి మంగళవారం విజయవాడలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆనందపురం మండలంలో మరో డేటా సెంటర్‌ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. జగన్నాథపురంలో 486 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ను హోల్డింగ్స్‌ ఇండియా ఏర్పాటుచేయనుంది. వీరికి 200 ఎకరాలు కేటాయించారు. వీరి పెట్టుబడి రూ.58,743 కోట్లు. ఇందులో వేయి నుంచి 1,250 మందికి ఉపాఽధి లభిస్తుంది.

- ఆనందపురం మండలంలోని కణమాంలో ఇంటిగ్రేటెడ్‌ వేర్‌హౌసింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌ ఏర్పాటు కోసం ఎస్టెలా సంస్థకు 15 ఎకరాలు కేటాయించారు.

- గాజువాక-పరవాడ మధ్య 3.6 గిగావాట్‌ సామర్థ్యం కలిగిన టాప్‌కాన్‌ సోలార్‌ సెల్‌ అండ్‌ మాడ్యుల్‌ సెల్‌ తయారీ ప్లాంటుకు అనుమతి ఇచ్చారు. అక్షత్‌ గ్రీన్‌టెక్‌ కంపెనీ రూ.1,600 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇందులో 750 మందికి ఉపాధి లభిస్తుంది.

Updated Date - Aug 19 , 2026 | 12:48 AM