గిరిజనులకు ఆర్థిక ఆసరా!
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:10 AM
మన్యంలో వెదురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అటవీ శాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే కృష్ణాపురం పైనరీలో త్రిపుర నుంచి తుల్డా విత్తనాలను తీసుకువచ్చి నర్సీరీని అభివృద్ధి చేసింది.
అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణ
వెదురు సాగుతో స్వయం ఉపాధికి ప్రణాళిక
కృష్ణాపురం పైనరీలో తుల్డా వెదురు సాగు
విజయవంతంగా నర్సరీ అభివృద్ధి
ఆదివాసీలకు వెదురు అల్లికలపై శిక్షణ
చింతపల్లి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): మన్యంలో వెదురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అటవీ శాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే కృష్ణాపురం పైనరీలో త్రిపుర నుంచి తుల్డా విత్తనాలను తీసుకువచ్చి నర్సీరీని అభివృద్ధి చేసింది. వచ్చే ఏడాది రైతులకు తుల్డా వెదురు సాగును పరిచయం చేయనుంది. ఈ వెదురుతో ఆదాయం సంపాదించేందుకు ఆదివాసీలకు అల్లికలపై శిక్షణ ఇవ్వనుంది.
ఏజెన్సీలో అటవీ శాఖ కొన్నేళ్లుగా వెదురు సాగు చేపడుతున్నది. చింతపల్లి డివిజన్‌లో మర్రిపాకలు, పత్రిల్లో వెదురుతో అటవీ శాఖకు మంచి ఆదాయం సమకూరుతున్నది. జాతీయ మార్కెట్‌లో వెదురు ఆధారిత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. ప్రజలు కూడా వెదురుతో చేపట్టిన అల్లికలు, వస్తువులను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అరకులోయ, బొర్రా పర్యాటక ప్రాంతాల్లో గిరిజనులు వెదురుతో పలు రకాల వస్తువులను తయారు చేసి సందర్శకులకు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. గిరిజనులకు వెదురు ఆధారిత స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అల్లూరి జిల్లాతో పాటు 12 జిల్లాల్లో వెదురు ఉత్పత్తులు పెంపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
తుల్డా సాగుకు ప్రాధాన్యం
వెదురులో తుల్డా రకానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ వెదురు దృఢంగా, మన్నికగా ఉండడంతో నిర్మాణ రంగంలోనూ వినియోగిస్తున్నారు. ఈ వెదురుతో కుర్చీలు, బెంచీలు, అల్మారాలు, తదితర గృహోపకరణాలు అందంగా తయారు చేయవచ్చు. పరిశ్రమల ద్వారా నాణ్యమైన పేపర్ ఉత్పత్తి చేస్తున్నారు. హస్తకళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేత వెదురు కొమ్ములను ఆహారంగా తీసుకోవడంతోపాటు పచ్చళ్ల రూపంలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. త్రిపుర, ఈశాన్య రాష్ట్రాల్లో తూల్డా వెదురును అధికంగా సాగు చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలోనూ తుల్డా వెదురు సాగును విస్తరింపజేయాలని అటవీ శాఖ అధికారులు 2025 జూన్‌లో త్రిపుర నుంచి విత్తనాలను దిగుమతి చేసుకుని నర్సరీలను అభివృద్ధి చేశారు. ఈ ఏడాది ఏడు వేల మొక్కలు కృష్ణాపురం పైనరీలో వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆసక్తి గల గిరిజన రైతులకు తుల్డా వెదురు మొక్కలను పంపిణీ చేయనున్నారు.
వెదురు అల్లికలపై శిక్షణ
గిరిజనులకు స్వయం ఉపాధి కల్పనకు వెదురు అల్లికలపై శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది నుంచి శిక్షణ కార్యక్రమాలను ఎన్‌జీవోల సహకారంతో ప్రారంభించనున్నారు. చింతపల్లిలో ఏపీ డిపార్టుమెంట్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ సహకారంతో అచ్యుతాపురం ఎడ్యుకేషనల్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు, డైరీనగర్‌లో నిరుద్యోగ యువతకు వెదురు ఆధారిత అల్లికలు, వస్తువులు తయారీపై శిక్షణ ఇస్తున్నారు. గిరిజనులు తయారు చేసిన అల్లికలు, వస్తువులను పర్యాటక ప్రాంతాలైన లంబసింగి, చింతపల్లి, అరకు, వంజంగి, పాడేరు, అనంతగిరి ప్రాంతాల్లో విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. అల్లికల ఉత్పత్తులు పెరిగితే మైదాన ప్రాంతాలకు ఎగుమతి చేయనున్నారు. దీంతో వెదురు ద్వారా ఆదివాసీల ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుంది.