Share News

అబలకు ఆర్థిక ఆసరా

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:26 PM

మన్యంలో స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. మైదాన ప్రాంతం కంటే గిరిజన ప్రాంతంలోని మహిళలకే ఈ పథకం ద్వారా అధిక లబ్ధి చేకూరుతోంది. గతంతో పోల్చితే గిరిజన మహిళల ప్రయాణం రెట్టింపు అయ్యింది.

అబలకు ఆర్థిక ఆసరా
ఆర్‌టీసీ బస్సులో మహిళా ప్రయాణికులు

గిరిజన ప్రాంతంలో ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం

ఏడాదిలో 22,55,034 మంది మహిళలకు లబ్ధి

ఉచిత ప్రయాణంతో గిరి మహిళల ఆనందం

నేటితో స్త్రీశక్తి పథకానికి ఏడాది

(ఆంధ్రజ్యోతి- పాడేరు/పాడేరురూరల్‌)

ఏజెన్సీలో గతంలో రోజూ వారీగా 7 వేల మంది ప్రయాణించేవారు. వారిలో 3 వేల మంది మహిళలుండేవారు. స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పురుష ప్రయాణికుల సంఖ్య స్థిరంగా ఉండగా.. మహిళల సంఖ్య మాత్రం రెట్టింపు అయ్యింది. ఏజెన్సీలో పురుషులు కంటే మహిళలే అన్ని వ్యవహారాల్లో చురుగ్గా ఉంటారు. చివరకు వారపు సంతల్లో చిరు వ్యాపారాలు కూడా అధిక సంఖ్యలో మహిళలే చేస్తుంటారు. ఈక్రమంలో ఏజెన్సీలో గిరిజన మహిళల రాకపోకలకు ఉచిత ప్రయాణం చాలా వరకు ఉపయోగపడుతున్నది. గతంలో జీపులు, ఆటోల్లో వారపు సంతలకు వెళ్లే మహిళలు ఈ పథకం అందుబాటులోకి వచ్చినప్పటికీ నుంచి ఆర్‌టీసీ బస్సుల్లోనే వెళుతున్నారు. ఏజెన్సీలో మహిళలు స్త్రీశక్తి పథకాన్ని సద్వినియోగించుకుంటున్నారని స్థానిక డిపో మేనేజర్‌ ఎంఎస్‌ఎస్‌ నాయుడు తెలిపారు.

22,55,034 మంది మహిళలకులబ్ధి

కూటమి ప్రభుత్వం గతేడాది ఆగస్టు 15న ప్రారంభించిన స్త్రీశక్తి పథకం ద్వారా ఈ ఏడాది జూలై నెల వరకు జిల్లాలో 22,55,034 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లబ్ధి పొందారు. వారి టికెట్‌ చార్జీల రూపంలో ప్రభుత్వం నుంచి రూ.20,62,52,212 ను మహిళలు లబ్ధిపొందారని ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. ఏడాదిగా పరిశీలిస్తే.. గతేడాది అక్టోబరు, డిసెంబరు, ఈ ఏడాది జనవరి, జూలై నెలల్లో సగటున నెలకు 2 లక్షలు పైబడి ప్రయాణించగా, మిగిలిన నెలల్లో 2 లక్షల లోపు మహిళలు ప్రయాణాలు చేశారు.

ఆర్‌టీసీ డిపోలకు అదన పు బస్సులు అవసరం

జిల్లాలో స్త్రీశక్తి పథకానికి రెట్టింపు ఆదరణ లభిస్తుండడంతో బస్సులు సైతం పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వివిధ డిపోలకు చెందిన 110 వరకు బస్సులు తిరుగుతుండగా.. మరో 20 నుంచి 25 బస్సులు అదనంగా అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఉదాహరణకు పాడేరులో 45 బస్సులుండగా.. ప్రస్తుతానికి 43 బస్సులు ఏజెన్సీతోపాటు, విశాఖపట్నం, చోడవరం, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు నడుస్తున్నాయి. వాటిలో 30 పల్లెవెలుగు, 12 ఎక్స్‌ప్రెస్‌, 3 అల్ర్టా డీలక్స్‌ బస్సులు ఉన్నాయి. అయితే మహిళల ఉచిత ప్రయాణం నేపథ్యంలో కేవలం పాడేరు డిపోకే అదనంగా 12 బస్సులు అవసరమని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న ప్రయాణాల కంటే స్ర్తీశక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళల ప్రయాణాల సంఖ్య రెట్టింపు కావడంతో అదనపు బస్సులు సమకూర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఫ్రీ బస్సు ఎంతో ఉపయోగంగా ఉంది

ఎ.తిరుపతి, మత్స్యపురం, జి.మాడుగుల మండలం

ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేసే మాలాంటి మహిళలకు స్త్రీశక్తి పథకం ఎంతో ఉపయోగపడుతున్నది. ఉచిత ప్రయాణం కావడంతో ఆర్‌టీసీ బస్సుల్లో ఎక్కడి వెళ్లాలన్నా.. రవాణా కర్చులు అవుతాయనే ఆందోళన పోయింది. పలు చోట్ల పనులకు వెళ్లేవారికి, బంధువుల ఇళ్లకు వెళ్లేవారికి ఉచిత బస్సు ప్రయాణంతో చాలా వరకు డబ్బులు ఆదా అవుతున్నాయి.

మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

కె.పద్మావతి, ప్రయాణికురాలు, జీకేవీధి

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం గొప్ప విషయం. వాస్తవానికి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయరని అందరం భావించాం. కాని అందరి అభిప్రాయాలకు భిన్నంగా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం గతేడాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం ఎంతో ఆనందంగా ఉంది.

Updated Date - Aug 14 , 2026 | 11:26 PM