అతివలకు ఆర్థిక ‘శక్తి’
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:14 AM
మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన ‘స్ర్తీశక్తి’ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాల్లో సంతోషాలను నింపుతోంది.
స్త్రీ శక్తి పథకం ప్రారంభించి నేటికి ఏడాది...
జిల్లాలోని 529 బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం
ప్రయాణికుల్లో 71 శాతం మంది మహిళలే
రోజుకు 2.66 లక్షల మంది చొప్పున ఏడాదిలో సుమారు 8.3 కోట్ల మంది ప్రయాణం
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా వెసులుబాటు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన ‘స్ర్తీశక్తి’ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాల్లో సంతోషాలను నింపుతోంది. నిరుపేదలు, చిరుద్యోగులైన మహిళలు రోజువారీ పనుల కోసం గతంలో రవాణా చార్జీల నిమిత్తం చేసిన ఖర్చు పూర్తిగా తగ్గింది. ఆ మొత్తాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించుకునే వెసులుబాటు కలిగింది. ఈ పథకం ప్రారంభించి శనివారం (ఈనెల 15వ తేదీ నాటికి) నాటికి ఏడాది పూర్తికావస్తుండడంతో జిల్లాలో పథకం తీరుతెన్నులపై కథనం...
విశాఖ జిల్లా పరిధిలో మధురవాడ, విశాఖపట్నం, మద్దిలపాలెం, పెదవాల్తేరు, గాజువాక, స్టీల్ సిటీ, సింహాచలం డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల నుంచి ప్రతిరోజూ 646 బస్సులు 119 రూట్లలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తూ ‘స్త్రీశక్తి’ పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం కింద మహిళలు ఎక్స్‌ప్రెస్‌లు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, సిటీ బస్సులు, పల్లెవెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. గత ఏడాది ఆగస్టు 15న పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు జిల్లా పరిధిలో 16 ఎక్స్‌ప్రెస్‌లు, 114 సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, ఒక పల్లెవెలుగు, 398 సిటీ బస్సులు మొత్తం 529 బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తున్నారు. ఈ బస్సులు 119 రూట్లలో ప్రతిరోజూ 1.61 లక్షల కిలోమీటర్ల తిరుగుతూ మహిళా ప్రయాణికులను ఉచితంగా వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. గత ఏడాదికాలంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారిలో పురుషులు, బస్‌పాస్‌లు కలిగిన వారిని మినహాయిస్తే 71 శాతం మంది ఉచితంగా ప్రయాణాలు చేసిన మహిళలే కావడం విశేషం. ప్రతిరోజూ ఎక్స్‌ప్రెస్, సిటీబస్సు, మెట్రోసిటీబస్సుల్లో 2.66 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. గత ఏడాది కాలంలో జిల్లాలో సుమారు 8.3 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. జిల్లా వరకూ చూస్తే...ఈ పథకం అమలు వల్ల ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వంపై రూ.221 కోట్లు భారం (ఈ మొత్తం మహిళలకు కలిగే లబ్ధిగా పేర్కొనవచ్చు) పడుతోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం
బి.అప్పలనాయుడు, ఆర్టీసీ రీజినల్ మేనేజర్
స్త్రీశక్తి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. మహిళలంతా దాదాపు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. దీనివల్ల బస్సుల్లో రద్దీ కూడా పెరిగి, కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నా వీలైనంత వరకు తక్షణ పరిష్కారం చేస్తున్నాం. సర్వీసుల రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అన్ని స్టేజీల్లోనూ బస్సులను ఆపాలని ఎప్పటికప్పుడు సిబ్బందికి ఆదేశాలు జారీచేస్తున్నాం.
నెలకు రూ.1,800 ఆదా
ఆర్.సరస్వతి, దువ్వాడ
మాది దువ్వాడ సమీపాన నరవ అనే పల్లెటూరు. నేను ఫార్మాసిటీలోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నా. ప్రతిరోజు మా ఊరు నుంచి కంపెనీకి వెళ్లేందుకు గతంలో రోజుకు రూ.60 వరకూ ఖర్చు అయ్యేది. అంటే సుమారు నెలకు రూ.1,800 వరకూ చార్జీలు అయ్యేవి. కూటమి ప్రభుత్వం మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ స్ర్తీశక్తి పథకం అమలు చేయడంతో నెలకు సుమారు రూ.1,800 వరకూ మిగులుతున్నాయి.
నెలకు రూ.1,500 పొదుపు
-వెంకటలక్ష్మి, వాంబే కాలనీ, మధురవాడ.
నేను ఇంటి వద్ద టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నా. సరకులు కోసం తరచూ నగరానికి వెళ్లాల్సి ఉంటుంది. స్త్రీశక్తి పథకం అమలులోకి వచ్చిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నా. దీనివల్ల నెలకు కనీసం చార్జీల రూపంలో రూ.1,500 వరకు ఆదా అవుతున్నాయి. ఆ మొత్తం పొదుపు చేయడానికి అవకాశం కలుగుతోంది.
చంద్రబాబుకు రుణపడి ఉంటాం
టి.జ్యోతి, గోపాలపట్నం
స్త్రీశక్తి పథకం వల్ల మాకు ఎంతో మేలు జరిగింది. గోపాలపట్నంలో నివాసం ఉంటున్న నేను రోజూ విధులు నిర్వర్తించేందుకు జ్ఞానాపురం వెళ్లాలి. గతంలో రోజుకు రూ.50 ప్రయాణానికి ఖర్చయ్యేది. స్త్రీశక్తి పథకం వల్ల నెలకు రూ.1,500 వరకూ ఆదా అవుతున్నాయి. విశాఖ నగరంలో వేల సంఖ్యలో ప్రైవేటు ఉద్యోగాలు చేసే మహిళలు ఉన్నారు. స్త్రీశక్తి పథకం వల్ల అందరికీ రవాణా ఖర్చులు మిగులుతున్నాయి. చంద్రబాబుకు మహిళలంతా రుణపడి ఉన్నాం.