డ్వాక్రాలకు ఆర్థిక సాధికారత
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:53 AM
మహిళల ఆర్థిక సాధికారితకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నది. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల సభ్యులు ఆర్థికంగా స్థిరపడాలన్న ఉద్దేశంతో స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు విరివిగా రుణాలు మంజూరు చేయిస్తున్నది. స్త్రీనిధి పథకం కింద జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.224.45 కోట్ల రుణాలు మంజూరు చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వంద శాతం పెంచి రూ.450 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
’స్త్రీ నిధి’ పథకం కింద స్వయం సహాయక సంఘాలకు విరివిగా రుణాలు
2025-26లో రూ.224.45 కోట్లు మంజూరు
స్వయం ఉపాధికి సద్వినియోగం చేసుకున్న మహిళలు
ఈ ఏడాది ఏకంగా రూ.450 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
గరిష్ఠ రుణపరిమితి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంపు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
మహిళల ఆర్థిక సాధికారితకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నది. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల సభ్యులు ఆర్థికంగా స్థిరపడాలన్న ఉద్దేశంతో స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు విరివిగా రుణాలు మంజూరు చేయిస్తున్నది. స్త్రీనిధి పథకం కింద జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.224.45 కోట్ల రుణాలు మంజూరు చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వంద శాతం పెంచి రూ.450 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
రాష్ట్రంలో బలమైన వ్యవస్థగా మారిన డ్వాక్రా సంఘాలను చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాలను ఆయన తన మానస పుత్రికగా చెప్పుకుంటూ వుంటారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో వున్నాసరే డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి పలు కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తుంటారు. బ్యాంకుల నుంచి సులువుగా రుణాలు పొందిందుకు ‘స్త్రీనిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్’ను ఏర్పాటు చేశారు. దీనిని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస,్థ వెలుగు శాఖలు పర్యవేస్తుంటాయి. జిల్లాలో ప్రస్తుతం 1,277 గ్రామ ఐక్య సంఘాలు, వీటి పరిధిలో 39,781 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి ఈ సంఘాల్లో ప్రస్తుతం 4,15,957 మంది సభ్యులు ఉన్నారు. స్త్రీనిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి పథకం కింద సుమారు 39 వేల స్వయం సహాయక సంఘాలకు రూ.224.45 కోట్ల మేర రుణాలు మంజూరు చేశారు. వీరిలో అత్యధికులు స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకొని సంతృప్తికరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. తీసుకున్న రుణాన్ని వాయిదాల రూపంలో ఆన్‌లైన్ విధానంలో ఆయా బ్యాంకులకు తిరిగి చెల్లిస్తున్నారు. స్ర్తీనిధి రుణాలను డ్వాక్రా సంఘాలు సద్వినియోగం చేసుకుంటుండడంతో ప్రభుత్వం ఈ ఏడాది రుణ పరిమితిని వంద శాతానికి పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.450 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని డీఆర్‌డీఏ అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపగా.. ఈ మేరకు జిల్లాకు అవసరమైన నిధులను కేటాయించింది. దీంతో డ్వాక్రా సంఘాలకు భారీ ఎత్తున రుణాలు మంజూరు చేసే వెసులుబాటు కలిగింది.
వేగంగా రుణాలు మంజూరు
స్త్రీనిధి పథకంతో స్వయం సహాయక సంఘాల సభ్యులకు గతంలో కన్నా సులభంగా, వేగంగా రుణాలు మంజూరు కానున్నాయి. సంఘంలో తీర్మానం చేసి, ఆమోదముద్ర పడిన వెంటనే డీఆర్‌డీఏ-వెలుగు కార్యాలయాల ద్వారా రుణాలు చేస్తారు. డ్వాక్రా సంఘాల్లోని సభ్యులకు ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు, ఇతరత్రా అవసరాలకు అదనంగా రుణాలు మంజూరు చేయనున్నారు. గతంలో ఒక్కో సంఘానికి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకే రుణాలు మంజూరయ్యేవి. ఇక నుంచి ప్రతి సంఘానికి గరిష్ఠంగా రూ.8 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. రుణం సొమ్ముతో స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేస్తారు.