Share News

అద్దెకు ఆర్థిక భవనం?

ABN , Publish Date - Apr 10 , 2026 | 01:29 AM

నగరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం సమీపంలో ఆర్థిక శాఖ కోసం నిర్మించిన భవనాన్ని పూర్తిగా వినియోగించుకోవడంపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు.

అద్దెకు ఆర్థిక భవనం?

గతంలో టీడీపీ హయాంలో జీ+3 నిర్మాణానికి నిర్ణయం

ఆ తరువాత వైసీపీ హయాంలో అదనంగా రెండు అంతస్థులు

ప్రస్తుతం రెండో అంతస్థులో ఖజానా శాఖ కార్యాలయం

మిగిలిన నాలుగు అంతస్థులు ఖాళీ

వాణిజ్య సంస్థలకు, ఐటీ కంపెనీలకు అద్దెకు ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారుల నిర్ణయం

అయితే కాంట్రాక్టర్‌కు రూ.8 కోట్ల బకాయి

అది చెల్లిస్తేనే అధికారికంగా అప్పగింత

విశాఖపట్నం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం సమీపంలో ఆర్థిక శాఖ కోసం నిర్మించిన భవనాన్ని పూర్తిగా వినియోగించుకోవడంపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ఐదు అంతస్థుల భవనంలో ప్రస్తుతం రెండో అంతస్థులో జిల్లా ఖజానా కార్యాలయం ఒక్కటే కొనసాగుతుంది. ఇంకా అందుబాటులో ఉన్న నాలుగు అంతస్థుల్లో కొంత విస్తీర్ణాన్ని ఆర్థిక శాఖ అనుబంధ విభాగాలకు కేటాయించి, మిగిలిన ప్రదేశాన్ని వాణిజ్య సంస్థలు లేదా ఐటీ కంపెనీలకు ఇవ్వాలని నాలుగు రోజుల క్రితం భవనాన్ని సందర్శించిన ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌, సంయుక్త కార్యదర్శి అల్లాడ గౌతమ్‌ నిర్ణయించారు. ఐటీ కంపెనీలకు భవనంలో కొంత భాగం ఇచ్చే ప్రక్రియ 45 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. ఈ మేరకు జిల్లా ఖజానాఽధికారి కవిటి మోహనరావు, ఏపీ విద్యా సంక్షేమ మౌలిక వసతుల ఇంజనీరింగ్‌ ఈఈ అంబటి రమేష్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా భవనం నిర్మించిన కాంట్రాక్టర్‌కు ఇంకా రూ.ఎనిమిది కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. బకాయి చెల్లిస్తే తప్ప అధికారికంగా భవనం అప్పగింత ప్రక్రియ పూర్తికాదు.

నగరంలో ఆర్థిక శాఖకు సంబంధించి జిల్లా ఖజానా, ఏపీ జీఎల్‌ఎ, పే అండ్‌ అకౌంట్స్‌, ఆడిట్‌ విభాగాలను ఒకే భవనంలోకి తీసుకురావాలని గత టీడీపీ ప్రభుత్వ హయాం(2014-19)లో నిర్ణయించి రూ.14.2 కోట్లతో జీ+3 (సెల్లార్‌ ప్లస్‌ మూడు అంతస్థులు) నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. ఆ తరువాత వైసీపీ హయాంలో విశాఖ నుంచి పాలన సాగించాలన్న సీఎం జగన్‌ నిర్ణయానికి అనుగుణంగా మరో రెండు అంతస్థులు (నాలుగు, ఐదు) నిర్మించాలని ఆదేశాలు అందాయి. రూ.10.9 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి అదే కాంట్రాక్టరుకు పనులు అప్పగించారు. ఈ భవనం నుంచి ఆర్థిక శాఖ కార్యకలాపాలు నిర్వహించాలని భావించిన ఉన్నతాధికారులు అక్కడే సీనియర్‌ అధికారులకు రెస్ట్‌ రూమ్‌ల కోసం ఐదో అంతస్థు నిర్మించారు.

భవనం భారీగా నిర్మించినప్పటికీ కాంట్రాక్టర్‌కు వైసీపీ హయాంలో ఏ రోజు సకాలంలో బిల్లులు చెల్లించలేదు. చేసిన పనులకు తగినంత బిల్లులు చెల్లించకపోవడంతో మిగిలిన పనులు పూర్తిచేయలేదు సరికదా ఇంతవరకు అధికారికంగా భవనం అప్పగించలేదు. ఇంతవరకు కాంట్రాక్టర్‌కు రూ.10.82 కోట్లు బిల్లులు మంజూరుచేశారు. అయితే నాలుగు, ఐదు అంతస్థులకు సంబంధించి చేపట్టిన పనులకు అధికారికంగా ఆమోదం లేదని చెబుతున్నారు. జీ ప్లస్‌ త్రీ భవన నిర్మాణాలకు రూ.నాలుగు కోట్లు, ఆమోదం తెలపని నాలుగు, ఐదో అంతస్థు కోసం రూ.నాలుగు కోట్లు...మొత్తం రూ.8 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆమోదం లేకుండా నిర్మించిన నాలుగు, ఐదో అంతస్థులకు సంబంధించి రూ.నాలుగు కోట్ల బిల్లులు ఇంతవరకు అప్‌లోడ్‌ చేయలేదని తెలిసింది. బిల్లులు మంజూరులో జాప్యం కారణంగా భవనంలో అన్ని అంతస్థులకు విద్యుత్‌ సదుపాయం లేదు. భవన నిర్మాణం కోసం తాత్కాలికంగా తీసుకున్న మీటరు నుంచి ప్రస్తుతం రెండో అంతస్థులోని జిల్లా ఖజానా కార్యాలయం అవసరాలకు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భవనంలోని ఐదు అంతస్థులు వినియోగంలోకి తీసుకురావాలంటే ప్రత్యేకించి ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. అందుకు ముందుగా అనుమతించిన పనులకు సంబంధించి రూ.నాలుగు కోట్లు, ఆ తరువాత చేపట్టిన వాటికి రూ.4 కోట్లు...మొత్తం రూ.ఎనిమిది కోట్లు విడుదల చేయాలి. ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Updated Date - Apr 10 , 2026 | 01:29 AM