ఎట్టకేలకు సివిల్స్ ఉచిత శిక్షణకు మోక్షం
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:51 PM
ఎట్టకేలకు ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగులకు ఈ ఏడాది సివిల్స్‌కు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది.
న్యాయపరమైన సమస్యలతో రెండేళ్లుగా ఆగిన కోచింగ్
ఈ ఏడాది వంద మంది ఎంపికకు 19న రాత పరీక్ష
పాడేరు, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగులకు ఈ ఏడాది సివిల్స్‌కు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. 2022లో ఇక్కడ ఐటీడీఏ పీవోగా పని చేసిన రోణంకి గోపాలకృష్ణ గిరిజన నిరుద్యోగులకు మేలు చేయాలనే ఆలోచనతో అప్పట్లో సివిల్స్ ఉచిత కోచింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆయన బదిలీ తర్వాత సైతం ప్రతి ఏడాది సివిల్స్ ఉచిత కోచింగ్‌కు ఐటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో గిరిజన నిరుద్యోగులకు సివిల్స్ ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు పలు కోచింగ్ సెంటర్ల మధ్య పోటీ ఏర్పడడంతో అప్పటి వరకు కోచింగ్ ఇస్తున్న సంస్థను తప్పించాలని డిమాండ్ చేస్తూ మరో కోచింగ్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో సివిల్స్ ఉచిత కోచింగ్ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో గత రెండేళ్లుగా కోచింగ్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. 2024, 2025లో సైతం నిరుద్యోగుల నుంచి అధికారులు 1,119 దరఖాస్తులు స్వీకరించినప్పటికీ న్యాయపరమైన సమస్యల కారణంగా ఉచిత కోచింగ్ నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సివిల్స్ ఉచిత శిక్షణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గిరిజన నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. అయితే ఐటీడీఏ అధికారులు ఎట్టకేలకు న్యాయపరమైన చిక్కులను అధిగమించి ఈ ఏడాది సివిల్స్ ఉచిత కోచింగ్ నిర్వహించేందుకు మార్గం సుగమం చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం గతంలో దరఖాస్తులు చేసిన అభ్యర్థులకు హోల్ టికెట్‌లు జారీ చేయడంతో పాటు కొత్తగా ఎవరైన దరఖాస్తులు చేసుకునే వారికి సైతం అవకాశం కల్పిస్తున్నారు. ఈ నెల 18 నాటికి హాల్ టికెట్ల జారీ ప్రక్రియను పూర్తి చేసి, 19న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన వంద మంది అభ్యర్థులకు 11 నెలలపాటు ఉచిత భోజన వసతి కల్పిస్తూ విశాఖ వేపగుంటలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో సివిల్స్ కోచింగ్ అందిస్తారు. అలాగే గతంలో కోచింగ్ పొందిన పలువురు అభ్యర్థులు వివిధ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు పొందడంతో ఉచిత కోచింగ్‌కు గిరిజన నిరుద్యోగులు ఆసక్తి కనబరుస్తున్నారు.